Firing in Pulivendula: వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐపై ఆరోపణలు చేసిన పులివెందులకు చెందిన భరత్ యాదవ్ పోలీసుల నుంచి తుపాకీ లైసెన్స్ తెచ్చుకోవడం.. చర్చనీయాంశమైంది. పులివెందులలో టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్న వ్యక్తికి.. పోలీసులు ఏ విధంగా తుపాకీ లైసెన్స్ ఇచ్చారనే దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివేకా హత్య కేసు నుంచే పులివెందుల్లో పేరు తెచ్చుకున్న భరత్ యాదవ్.. తుపాకీ ఉందనే కారణంతో భూ దందాలు, సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు తెలిసింది.. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఇలాంటి వ్యక్తులను పెంచి పోషించడం.. అసాంఘిక శక్తులకు ఆజ్యం పోసినట్లుగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
యూట్యూబ్ ఛానల్ విలేకరిగా..భరత్ కుమార్ యాదవ్.. ఇతను పులివెందుల పట్టణంలో గతంలో యూట్యూబ్ ఛానల్ విలేకరిగా పని చేశాడు. పులివెందుల ఆర్టీసీ బస్టాండు ఎదురుగా టిఫిన్ సెంటర్ నడుపుతున్నాడు. అంతవరకు బాగానే ఉన్నా.. 2019 మార్చిలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తర్వాత అతని పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. తరచూ మీడియా సమావేశాలు నిర్వహించి.. సీబీఐకి వ్యతిరేకంగా మాట్లాడటం చేసేవాడు.
వైసీపీ నేతలకు దగ్గరగా..2021 మార్చిలో వివేకా కేసులో నిందితుడుగా ఉన్న డ్రైవర్ దస్తగిరిని సీబీఐ అధికారులు దిల్లీకి విచారణకు పిలిచారు. ఆ సమయంలోనే మరో నిందితుడు శివశంకర్ రెడ్డి సూచనల మేరకు భరత్ యాదవ్ దిల్లీ వెళ్లాడు. దస్తగిరితో వారం రోజులు ఉన్నాడు. దస్తగిరిని సీబీఐ ప్రశ్నించే విషయాలను తెలుసుకుని శివశంకర్ రెడ్డికి చేరవేయడం భరత్ కుమార్ యాదవ్ పని. దిల్లీ నుంచి దస్తగిరి తిరిగి వచ్చిన తర్వాత.. అతన్ని మరోసారి భరత్ యాదవ్ కలిసి వైసీపీ ముఖ్యనేతల పేర్లు చెప్పవద్దని.. నీకేంకావాలన్నా వారు చూసుకుంటారని బెదిరించినట్లు దస్తగిరి సీబీఐకి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే సీబీఐ అధికారులు పలుమార్లు భరత్ యాదవ్‌ను కడపకు పిలిపించి అతని వాంగ్మూలం నమోదు చేశారు. ఏ-2 నిందితుడు సునీల్ కుమార్ యాదవ్‌కు సమీప బంధువైన భరత్ యాదవ్.. తర్వాత సీబీఐ అధికారులపై ఆరోపణలు చేశారు. సీబీఐ అఫిడవిట్లపై పులివెందులలో భరత్ యాదవ్ స్పందించి మాట్లాడేవాడు. ఇలా పులివెందులలోని వైసీపీ ముఖ్య నేతలకు భరత్ యాదవ్ దగ్గరయ్యాడు.
తుపాకీతో బెదిరింపులు, భూ దందాలు.. వివేకా కేసు విచారణ అంశాన్ని సాకుగా చూసి తుపాకీ లైసెన్స్ కావాలని గత ఏడాది పోలీసులకు దరఖాస్తు చేశాడు. అతని దరఖాస్తును స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తిరస్కరించారు. కానీ వైసీపీ ముఖ్యనేతల అండ కారణంగా జిల్లా పోలీసు యంత్రాంగం.. భరత్ యాదవ్‌కు తుపాకీ లైసెన్స్ ఇచ్చిందనేది బహిరంగ రహస్యమే. ఇదే తుపాకీతోనే ఏడాది నుంచి పులివెందుల చుట్టు పక్కల ప్రాంతాల్లో భరత్ యాదవ్ భూ దందాలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో తన తాతలు అమ్మిన భూములు, ఇళ్ల స్థలాలను ఇప్పుడు దౌర్జన్యంగా లాక్కుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. 2 నెలల కిందట తన టిఫిన్ సెంటర్ పక్కన ప్రహరీ గోడ విషయంలో తుమ్మలపల్లికి చెందిన విశ్వనాథ్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి కుటుంబాన్ని భరత్ యాదవ్ తుపాకీతో బెదిరించాడు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లినా.. మిన్నకుండి పోయారు.