viveka murder case : ‘వై.ఎస్.వివేకానందరెడ్డిని కలిసేందుకు ఈ రోజు రాత్రి 11.30 గంటలకు ఆయన ఇంటికి వెళ్తున్నా’ అంటూ 2019 మార్చి 14 సాయంత్రం 5 గంటల సమయంలో సునీల్ యాదవ్ తనతో చెప్పాడని అతని బంధువు, పులివెందుల వాసి భరత్‌యాదవ్ సీబీఐకి తెలిపారు. ఆ రోజు రాత్రి 10 గంటలకు సునీల్‌కు ఫోన్ చేసి వివేకాను కలిశావా అని అడిగితే. పదే పదే ఫోన్ చేయొద్దంటూ తనపై అసహనం వ్యక్తం చేశాడని పేర్కొన్నారు. 2019 మార్చి 15న ఉదయం 5.30కు మరోసారి ఫోన్ చేయగా సునీల్ ఫోన్ స్విచాఫ్‌లో ఉందని వివరించాడు. వివేకానందరెడ్డి మృతి గురించి తెలియగానే తొలుత ఆయన ఇంటి వద్దకు, అక్కడి నుంచి నేరుగా సునీల్ ఇంటికి వెళ్లి ఫోన్ ఎందుకు స్విచాఫ్ చేశావంటూ ప్రశ్నించానని చెప్పారు. అయితే వివేకా మృతి సమాచారమే తెలియనట్లు సునీల్ యాదవ్ ప్రవర్తించటంతో అతనిపై తనకు అనుమానం కలిగిందన్నారు. సునీల్ ఇంటి నుంచి తాను నేరుగా పులివెందుల ప్రభుత్వాసుపత్రికి వెళ్లి వివేకా మృతదేహాన్ని చూశానని చెప్పారు. వివేకా మృతి సమాచారం తెలిసినా ఆయనకు సన్నిహితంగా ఉండే సునీల్ యాదవ్, దస్తగిరి, ఉమాశంకర్‌రెడ్డి ఆయన ఇంటి వద్దకు, ప్రభుత్వాసుపత్రికి రాకపోవటంతో తనకు అనుమానం మరింత బలపడిందని వివరించారు. ఈ మేరకు గతేడాది ఆగస్టు 21న ఆయన సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. అందులోని ప్రధానాంశాలివే...
అలా చెప్పటం దిగ్భ్రాంతి కలిగించింది
నా ప్లాటును ఫోర్జరీ పత్రాలతో ఒకరు ఆక్రమించారు. వివేకానందరెడ్డి ద్వారా ఆ వివాదాన్ని పరిష్కరించుకోడానికి నేను సునీల్‌యాదవ్‌ను సంప్రదించాను. కమీషన్‌గా రూ.లక్ష ఇవ్వాలని అతనడిగితే అందుకు అంగీకరించాను. 2019 మార్చి 14న ఇదే విషయమై నేను సునీల్‌తో మరోసారి మాట్లాడాను. ఆ రోజు రాత్రి 11.30 గంటల సమయంలో వివేకా ఇంటికి వెళ్తానని, ప్లాటు విషయం మాట్లాడతానని చెప్పాడు. ఆ రోజు మద్యం తాగాక రాత్రి 9.15- 9.30 గంటల మధ్య సునీల్‌ను ఆయన ఇంటివద్ద విడిచిపెట్టాను. రాత్రి 10 గంటల సమయంలో ఫోన్ చేసి వివేకాను కలిశావా? అని అడిగితే పదే పదే ఫోన్ చేయొద్దని చెప్పాడు. మార్చి 15న ఉదయం సునీల్‌ను ఆయన ఇంట్లో కలిసినప్పుడు.. ఉదయం 11 గంటలకల్లా నా ప్లాటు ఒరిజినల్ పత్రాల్ని ఇప్పిస్తానని, సమస్య పరిష్కరమైపోతుందని చెప్పాడు. అప్పటికే వివేకా మృతి చెందినట్లు అందరికీ తెలిసింది. అలాంటిది 11 గంటలకు నా సమస్య పరిష్కారం అయిపోతుందని సునీల్ చెప్పటం నాకు దిగ్భ్రాంతి కలిగించింది. అతను నటిస్తున్నాడని అర్థమైంది. హత్యలో భాగస్వామి అయి ఉండొచ్చని ఆ తర్వాత అనుమానం కలిగింది. -భరత్‌యాదవ్