కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో రోజురోజుకు కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. బ్యాంకు అధికారులకు సైతం కరోనా సోకడంతో రెండు బ్యాంకులను మూసివేశారు. జమ్మలమడుగు పట్టణంలో రెండు ప్రధాన బ్యాంకులతో పాటు ఓ ప్రైవేటు ఆసుపత్రి సైతం మూత పడింది. ఆంధ్రా బ్యాంకు, కెనరా బ్యాంకులో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది. ప్రధానమైన బ్యాంకులు మూతపడటంతో ఖాతాదారులు అవస్థలు పడుతున్నారు.
రెండు రోజుల క్రితమే వైఎస్సార్ చేయూత పథకం కింద మహిళలకు రూ.18,750 వారి ఖాతాల్లో జమయ్యాయి. చాలామంది మహిళలు డబ్బులు ఇంకా తీసుకోలేదు. ఈలోగా ఆ రెండు బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కరోనా రావడంతో అవి మూతపడ్డాయి. దీంతో పాటు ఓ ప్రైవేటు ఆసుపత్రి సైతం మూతపడడం వల్ల పట్టణ ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే జమ్మలమడుగు పట్టణంలో 350 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు పట్టణంలో లాక్ డౌన్ విధించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నా... కేసుల సంఖ్య అదుపులోకి రాకపోవడం వల్ల అధికారులకు సవాలుగా మారింది.