కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకించాల్సిన అవసరం ప్రతి బ్యాంకు ఖాతాదారునిపై ఉందని బ్యాంకు ఉద్యోగ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ.. ఐక్యవేదిక తలపెట్టిన రెండు రోజుల సమ్మెలో భాగంగా సోమవారం కడప జిల్లా జమ్మలమడుగులో ర్యాలీ నిర్వహించారు.
స్థానిక ఎస్బీఐ ప్రధాన శాఖ నుంచి తాడిపత్రి రోడ్డు, పాత బస్టాండ్ మీదుగా, గాంధీ కూడలికి చేరుకుని నిరసన తెలియజేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, ప్రజా సంక్షేమానికి కట్టుబడి పని చేస్తున్నా బ్యాంకులను ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.
కడపలో నిరసన కార్యక్రమం..
కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణను నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని కడపలోని బ్యాంకు సంఘాల నాయకులు హెచ్చరించారు. బ్యాంకుల ప్రైవేటీకరణను నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు, రేపు బ్యాంకులు బందుకు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా బ్యాంకులను మూసివేశారు. దీంతో ఖాతాదారులు చాలా అవస్థలు పడ్డారు. ఏడు రోడ్ల కూడలిలోని కెనరా బ్యాంకు వద్ద బ్యాంకు ఉద్యోగులు తమ నిరసనను తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ సంస్థలన్నింటినీ కేంద్రం ప్రైవేట్‌పరం చేస్తుండటం దారుణమని ఖండించారు. కేంద్ర బ్యాంకుల ప్రైవేటీకరణను నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
పెట్రో ధరలపై లోక్‌సభలో మాట్లాడిన వైకాపా ఎంపీ