Badvel Revenue Division:కడప జిల్లాలో ప్రస్తుతం ఉన్న మూడు రెవెన్యూ డివిజన్లకు అదనంగా బద్వేలు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జులై 9న బద్వేలు ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు.. అధికారులు చకచకా దస్త్రాలు కదిలించారు. ప్రజల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత 12 మండలాలతో కలిపి బద్వేలు రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాష్ట్ర రెవిన్యూశాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి ఉత్తర్వులు వెలువరించారు.
జిల్లాలోని 51 మండలాలను నాలుగు రెవెన్యూ డివిజన్లుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇదివరకున్న కడప, జమ్మలమడుగు, రాజంపేటతో పాటు కొత్తగా బద్వేలు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కావడంతో.. మండలాలు కూడా అటూ ఇటుగా మారాయి.
కొత్తగా ఏర్పాటు చేసిన బద్వేలు రెవెన్యూ డివిజన్లో 12 మండలాలను చేర్చారు. కలసపాడు, అవధూత కాశినాయన, పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేలు, గోపవరం, అట్లూరు, బి.మఠం, ఖాజీపేట, మైదుకూరు, దువ్వూరు, చాపాడు మండలాలను చేర్చారు. గతంలో 18 మండలాలతో ఉన్న కడప రెవెన్యూ డివిజన్ పునర్విభజన తర్వాత 16 మండలాలకు కుదించారు.