Attempt Murder: కడప జిల్లా బద్వేలు పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలే ఆర్ధికలావాదేవిల వివాదంలో ఉన్న ఓ వ్యక్తిని ప్రత్యర్థులు హతమార్చడానికి కత్తులతో వెంబడించారు. ఫ్యాక్షన్ సినిమాల్లో వెంటాడినట్లుగా.. నడిరోడ్డుపై కత్తులతో వెంటాడుతున్న దృశ్యాలు, స్థానికలను భయభ్రాంతులకు గురిచేశాయి. ప్రత్యర్ధుల నుంచి తప్పించుకునేందుకు చాలా దూరం పరుగెత్తిన బాధితుడికి.. కొందరు సహకారించడంతో, ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ క్రమంలో అతని చేతి వేళ్లు తెగిపడ్డాయి. వైఎస్ఆర్ జిల్లా బి కోడూరు మండలం రామసముద్రం గ్రామానికి చెందిన బాలయ్య తన వాహనం కోసం డీజిల్ తీసుకెళ్లేందుకు.. బద్వేలులో ఉన్న పెట్రోలు బంక్ వద్దకు వచ్చారు. అక్కడ పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తికి, బాలయ్యకు మధ్య కొంత కాలంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివాదాలు కొనసాగుతున్నాయి.
ఈ నేపధ్యంలో డీజిల్ కోసం వచ్చిన బాలయ్యపై.. నిందితులు కత్తులతో ఒక్కసారిగా దాడికి దిగారు. దీంతో దాడి నుంచి తప్పించుకునేందుకు రోడ్డుపైకి పరిగెత్తిన బాధితుడిని వెంటాడారు. ఈ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నా.. బాధితుడి చేతి వెళ్లు తెగిపోయాయి. ప్రాణపాయం నుంచి బయటపడ్డ తర్వాత, అతడ్ని చికిత్స నిమిత్తం బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడ నుంచి తరువాత మళ్లీ కడప రిమ్స్ కు బాలయ్యను తరలించారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.