ఆశా కార్యకర్తలను సచివాలయాలకు అప్పగించే విధానాన్ని రద్దు చేయాలని.. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి డిమాండ్ చేశారు. వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి.. 6500 రూపాయలు ఇవ్వడం దారుణమని వాపోయారు. హామీ ఇచ్చిన మేరకు ఒకేసారి మొత్తం వేతనం ఇవ్వాలంటూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కడప కలెక్టరేట్ వద్ద ఆశా కార్యకర్తల నిరసన
కడప జిల్లాలో ఆశా కార్యకర్తలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తమ పట్ల సర్కారు చూపుతున్న వైఖరికి నిరసనగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వేతనాల చెల్లింపు విషయంలో మోసం చేశారని మండిపడ్డారు. తమను సచివాలయాలకు అప్పగించడాన్ని వ్యతిరేకించారు.
కరోనాతో మరణించిన ఆశా కార్యకర్తల కుటుంబాలకు 50 లక్షల రూపాయల బీమా ఇవ్వాలని ధనలక్ష్మి డిమాండ్ చేశారు. అర్హులైన సిబ్బందికి సంక్షేమ పథకాలను వర్తింప చేయాలన్నారు. రాజకీయ నాయకుల బెదిరింపు ఫోన్ కాల్స్‌ను నిర్మూలించాలని కోరారు. 60 సంవత్సరాలు దాటిన ఆశ వర్కర్లకు ఎలాంటి రాయితీలు ఇవ్వకుండా.. విధుల నుంచి తొలగించడాన్ని ఖండించారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:కడప జిల్లాలో వైకాపా శ్రేణుల పాదయాత్రలు