ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణానికి... శరవేగంగా ఏర్పాట్లు - ఒంటిమిట్టలో కోదండరాముడి కళ్యాణం

రెండో భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్టలో శ్రీకోదండరాముడి కల్యాణానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈనెల 15న రాత్రి 8 నుంచి 10 గంటల వరకు పండు వెన్నెల్లో రాముల వారి కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తితిదే ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకకు సీఎం జగన్‌ హాజరవుతున్నందున పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు.

Ontimitta Srikodandarama kalyanam
Ontimitta Srikodandarama kalyanam

By

Published : Apr 14, 2022, 5:38 AM IST

వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఈనెల 15న రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తితిదే ఏర్పాట్లు చేస్తోంది. స్వామివారి కల్యాణం కోసం 100 కిలోల ముత్యాల తలంబ్రాలను ఇప్పటికే తితిదే సమకూర్చింది. వాటిని 2 లక్షల ప్యాకెట్లుగా చేసి భక్తులకు కల్యాణం అనంతరం ప్రసాదంతో పాటు పంపిణీ చేయనున్నారు. ఇవే కాక శ్రీరాముని భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి గోటితో ఒలిచి తెచ్చి తలంబ్రాలను స్వామివారికి సమర్పిస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు తిరుపతి, కర్నాటక నుంచి భక్తులు తలంబ్రాలను తెచ్చి స్వామివారికి కానుకగా అందజేశారు.

ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణానికి... శరవేగంగా ఏర్పాట్లు

ఎక్కడా లేని విధంగా.. ఒంటిమిట్టలో రాములవారి కల్యాణం కాస్త భిన్నమైన సంప్రదాయం ప్రకారం జరుగుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా చతుర్దశి నాటి రాత్రి కల్యాణం నిర్వహిస్తారు. అయోధ్యాపురిలో జన్మించిన శ్రీరాముడు... వనవాసంలో భాగంగా దక్షిణాది వైపు ప్రయాణం చేశారని పురాణగాథలు చెబుతున్నాయి. ఆ సమయంలో మృకుండుడు అనే మహర్షి ఒంటిమిట్టకు సమీపంలో తపస్సు చేసుకునేవారట. రాములవారు అరణ్యవాసంలో భాగంగా అటు సంచరిస్తూ కొద్ది రోజులు మృకుండునికి రక్షణగా ఇక్కడ ఉన్నారని స్థలపురాణం చెబుతోంది. రాములవారు ఇక్కడ ఉన్న సమయంలో సీతాదేవికి విపరీతమైన దప్పిక కలిగిందట. అప్పుడు తన బాణాన్ని పాతాళంలోకి శ్రీరాముడు సంధించగా... మంచినీరు ఊరిందని చెబుతారు. అదే ప్రస్తుతం ఒంటిమిట్ట సమీపంలోని రామతీర్థంగా పిలుచుకునే చెరువని... రాములవారు నిలబడిన చోటే కోదండ రామాలయాన్ని నిర్మించారని భక్తుల నమ్మకం. ఒంటిమిట్ట ఆలయంలోని సీతారామలక్ష్మణుల విగ్రహాలు మూడూ ఒకే శిలలో చెక్కడం విశేషం. ప్రతి రామాలయంలోనూ కనిపించే ఆంజనేయస్వామి విగ్రహం ఇక్కడ కానరాదు. రాములవారు ఆంజనేయుడిని కలవక ముందే ఇక్కడకు వచ్చారనీ... అందుకే ఇక్కడ హనుమంతుని విగ్రహం ఉండదని చెబుతుంటారు. ఈ విశేషాలన్నీ ఒక ఎత్తయితే... శ్రీరామనవమి సందర్భంగా చతుర్దశి రాత్రివేళ కల్యాణాన్ని నిర్వహించడం ఒక ఎత్తు. పగటివేళ తాను రామకల్యాణాన్ని చూడలేకపోతున్నానని బాధపడుతున్న చంద్రుని ఊరడించేందుకు... రాములవారు ఇక్కడ రాత్రివేళ కల్యాణం చేసుకునే వరాన్ని ఒసగారని ఒక గాథ ప్రచారంలో ఉంది. మరో కథ ప్రకారం... చంద్రవంశ రాజులైన విజయనగరరాజులు తమ కులదైవానికి తృప్తికలిగేలా రాత్రివేళ కల్యాణాన్ని జరిపించే ఆచారాన్ని మొదలుపెట్టారని చెబుతారు. కారణం ఏదైనా ఇతర రామాలయాలకు భిన్నంగా ఒంటిమిట్టలో రాములోరి కల్యాణం చతుర్దశి నాటి రాత్రి, పౌర్ణమి రోజున ఘనంగా జరుగుతుంది.
రేపు సీఎం జగన్ హాజరు:కోదండరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు రాత్రి నిర్వహించే సీతారాముల కల్యాణానికి సీఎం జగన్ హాజరుకానున్నారు. ప్రభుత్వం నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ముఖ్యమంత్రి వస్తున్నందున ఒంటిమిట్ట పరిసర ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భక్తులతో పాటు ప్రముఖులు కల్యాణాన్ని తిలకించేందుకు ఆలయానికి దక్షిణ వైపున 52 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన శాశ్వత కల్యాణ వేదికను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే స్వాగత తోరణాలు, బారికేడ్లు, ఆర్చీల నిర్మాణం పూర్తైంది. కల్యాణానికి దాదాపు లక్ష మంది భక్తులు తరలివచ్చే అవకాశముందని భావిస్తున్న అధికారులు....వారికి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

నేడు మోహినీ అలంకారం: కోదండరాముడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామి వారికి హనుమత్సేవ నిర్వహించారు. నేడు మోహినీ అలంకారంలో భక్తులకు స్వామివారు దర్శనమిస్తారని ఆలయ అర్చకులు వెల్లడించారు.

ఇదీ చదవండి:Vontimitta: 15న ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవం... ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ABOUT THE AUTHOR

...view details