రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఆరోగ్యశ్రీ సేవలు సామాన్యులకు మరింత అందుబాటులోకి రానున్నాయి. వైద్య ఖర్చులు వెయ్యిరూపాయలు దాటితే ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావడం సహా...వైద్య సేవలను సైతం 2 వేల 146కు పెంచారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ఏడాది జనవరిలోనే ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించిన సీఎం....నేటి నుంచి కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి జగన్ ఆయా జిల్లాల్లోని ఆస్పత్రుల్లో వైద్య సేవలను ప్రారంభించనున్నారు. క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలను విస్తరించనున్నారు.
ఆరోగ్యశ్రీ కింద ప్రతి కుటుంబం ఏడాదికి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు వైద్య సేవలను వినియోగించుకోవచ్చు. క్యాన్సర్ రోగులకు ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుంది. కడప జిల్లాలో 30 ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో సేవలు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో మూడు ప్రభుత్వ ఆసుపత్రులు కాగా... మిగిలినవన్నీ ప్రైవేటు ఆసుపత్రులే. ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు పొందేవారు తప్పనిసరిగా ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ కార్డులు తీసుకెళ్లాల్సి ఉంటుంది.