apiic industries at kopparthi: కడప జిల్లా సీకేదిన్నె మండలం కొప్పర్తి వద్ద ఏపీఐఐసీ స్థలంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాన్ని.. వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌గా ప్రభుత్వం నామకరణం చేసింది. ఇందుకోసం యోగివేమన విశ్వవిద్యాలయానికి ఎదురుగా వెళ్లే కొప్పర్తి పారిశ్రామిక మార్గంలో.. అతిపెద్ద ప్రవేశ ద్వారాన్ని ఆధునిక హంగులతో ఏర్పాటు చేశారు. నాలుగు వరుసల రహదారికి ఇరువైపులా రెండు పెద్ద టవర్లను ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేశారు. రహదారి మధ్యలో ఎల్ఈడీ లైట్లను దారిపొడవునా అమర్చారు. ఎలక్ట్రానిక్స్ మ్యానిఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లో వివిధ పరిశ్రమలు నెలకొల్పేందుకు మొదటిదశలో 540 ఎకరాలను ఏపీఐఐసీ సిద్ధం చేసింది.
రూ.730 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈఎంసీలో మౌలిక వసతుల కల్పన చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈఎంసీ నార్త్‌బ్లాక్‌లో డిక్సన్ డిజిటల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ కోసం ఏపీఐఐసీ నాలుగు ఆధునిక షెడ్లు పూర్తిచేసి అప్పగించింది. డిక్సన్ కోసం 10 ఎకరాల విస్తీర్ణంలో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 22 కోట్లతో నాలుగు షెడ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో షెడ్ 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఏర్పాటు చేశారు. ఈ నాలుగు షెడ్లలో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, సీసీ కెమెరాలు, ల్యాప్‌టాప్ వంటి పరికరాలు తయారుచేస్తారు. ఈ కంపెనీ ఏర్పాటు కావడంతో స్థానికంగా 3 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు తెలిపారు.