అమ్మ ఒడి బోగస్ పథకమని రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు. కడప జిల్లా వేంపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దీనికి బడ్జెట్ నుండి ఒక్క పైసా కూడా కేటాయించలేదని.. మొత్తం నిధులను వివిధ కార్పొరేషన్ల నుంచి మళ్ళించారని ఆరోపించారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపు కార్పొరేషన్ల నిధులను అక్రమంగా అమ్మ ఒడికి మళ్లించి.. కొత్త పథకంగా ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు.
అమ్మ ఒడి సొమ్ము నాన్న బుడ్డికే..
వైకాపా ప్రభుత్వం అమ్మ ఒడి పథకం పేరుతో ఇచ్చే డబ్బు నాన్న బుడ్డికీ సరిపోవడం లేదని ఎద్దేవా చేశారు. సంవత్సరానికి ఇచ్చే రూ. 15 వేలను ఇంట్లో తండ్రి తాగుబోతై వాటిని మద్యానికి వినియోగించడం వల్ల ప్రస్తుతం 100 శాతం పెంచిన మద్యం ధరలతో ఆ డబ్బు తిరిగి ప్రభుత్వానికే చేరుతోందని అన్నారు.
పేర్లు మార్చడంలో సీఎం సిద్ధహస్తుడు:
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఉన్న పథకాలకు పేర్లు మార్చి.. కొత్త పేర్లతో ప్రచారం చేసుకుంటోందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఫీజు రియింబర్స్మెంట్ పథకానికి.. జగనన్న విద్య అని, స్కాలర్ష్ప్ పథకానికి.. జగనన్న దీవెన అని, స్కూల్ మెయింటినెన్స్ ఉండేది దానికి.. మనబడి నాడు నేడు అని, మధ్యాహ్న భోజనం పథకానికి జగనన్న గోరుముద్ద అంటూ కొత్త పేర్లతో ప్రచారం చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడయ్యాడని తులసి రెడ్డి అన్నారు.