సీఎం జగన్ సొంత నియోజకవర్గంలోనే ప్రజలు, దేవుళ్లకు రక్షణ లేదని.. ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి ఆరోపించారు. కడప జిల్లా వేముల మండలం చాగలేరులో సుమారు 80 కేజీల బరువుండే వినాయకుని విగ్రహం నిన్న రాత్రి మాయం కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం ఎక్కడో ఒక చోట ప్రజలు, విగ్రహాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 140 ఘటనలు జరిగినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో.. దుండగులు మరింత రెచ్చిపోతున్నారని విమర్శించారు. విగ్రహాల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మంత్రులు.. చేతనైతే చర్యలు తీసుకోవాలి లేదా రాజీనామా చేయాలని సూచించారు.
సీఎం నియోజకవర్గంలో విగ్రహం అపహరణపై విపక్షాల విమర్శలు - సీఎం జగన్ నియోజకవర్గంలోని చాగలేరులో వినాయకుడి విగ్రహం అదృశ్యం
కడప జిల్లా వేముల మండలం చాగలేరులో వినాయకుడి విగ్రహం అపహరణపై.. ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి, భాజపా రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి స్పందించారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే ప్రజలకు, దేవుళ్లకూ రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. హిందువుల ఓట్లతో అధికారం చేపట్టి వారి మనోభావాలను పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
![సీఎం నియోజకవర్గంలో విగ్రహం అపహరణపై విపక్షాల విమర్శలు bjp, congress leaders reaction on chagaleru idol theft](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10170753-1014-10170753-1610120031314.jpg)
చాగలేరులో అత్యంత పురాతన వినాయక విగ్రహం చోరీకి గురి కావడం అత్యంత దుర్మార్గమని భాజపా రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి అన్నారు. వేంపల్లి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత మూడు నెలల నుంచి దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 80 శాతం హిందువుల ఓట్లతో ముఖ్యమంత్రి అయ్యి.. వారి మనోబావాలు దెబ్బతీస్తుండటం అత్యంత హేయమన్నారు. ఈ తరహా ఘటనలు కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రామతీర్థం ఆలయ సందర్శనకు భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజును అనుమతించాలని డిమాండ్ చేశారు.