కడప జిల్లా ప్రొద్దుటూరు మోడంపల్లి వీధికి చెందిన కటారి రామన్న, మునెమ్మ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. రెండో అమ్మాయి కటారి సజోత్స్న.. నాలుగో తరగతి చదువుతోంది. మూడేళ్ల క్రితం సజోత్స్న పుట్టిన రోజుకు అక్క విజయజ్యోతి చదరంగం బోర్డును బహుమతిగా ఇచ్చింది.
అప్పటి నుంచి చదరంగం అలవాటైన సజోత్స్న.. ప్రతిభను మెరుగుపరుచుకుంటూ వచ్చింది. బాలికలోని ఆసక్తిని గుర్తించిన తల్లితండ్రులు కడపలోని శిక్షకుడు అనిష్ దార్బర్ వద్ద చెర్పించారు. ఆయన సజోత్స్నకు మెళకువలు నేర్పారు. అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో చదరంగంలో చెడుగుడు ఆడుతోంది.. ఈ చిచ్చరపిడుగు.
మూడేళ్ల కాలంలోనే బాలిక సజోత్స్న అనేక పతకాలు తన ఖాతాలో వేసుకుంది. జిల్లా స్థాయిలో 30, రాష్ట్ర స్థాయిలో మరో నాలుగు అవార్డులు దక్కించుకుంది. ఫిబ్రవరిలో 14 నుంచి 16 వరకూ భీమవరంలో బాలికల విభాగం రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటిన సజోత్స్న... జాతీయ స్థాయికి ఎంపికైంది. ఏప్రిల్ 16 నుంచి 24 వరకూ హర్యానాలో జాతీయ స్థాయి పోటీలు జరగాల్సి ఉండగా... కరోనా కారణంగా వాయిదా పడ్డాయి.