కడపలో రాయలసీమ సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్స్ సమావేశం SARPANCHES AGITATION : రాష్ట్రంలో రెండేళ్ల నుంచి దాదాపు 13 వేల గ్రామ పంచాయతీల సర్పంచులు రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల ఉత్సవ విగ్రహాల్లా మారిపోయారని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్స్, ఏపీ సర్పంచుల సంఘం ఆక్షేపించింది. కడపలోని శ్రీనివాస రెసిడెన్సీలో నిర్వహించిన రాయలసీమ సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్స్ సమావేశానికి సీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లా నుంచి ముఖ్యనాయకులు, సర్పంచులు హాజరయ్యారు. పంచాయతీరాజ్ ఛాంబర్స్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీలక్ష్మీ ముత్యాలరావు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
విద్యుత్ బకాయిలు చెల్లించవద్దు :14వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేసినప్పటికీ విద్యుత్ బకాయిల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 8600 కోట్ల రూపాయలను దారి మళ్లించిందని సంఘం నాయకులు మండి పడ్డారు. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలోని 12918 గ్రామ పంచాయతీ సర్పంచులు విద్యుత్ బకాయిలను చెల్లించవద్దని అధికారులు బెదిరించినా ఎదుర్కొందామని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్స్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. కడప సమావేశం నుంచి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
పది రోజుల గడువు.. ఆందోళన తీవ్రం : గ్రామాల్లో సర్పంచులుగా గెలిచినా ప్రజలకు సేవ చేయడానికి నిధులు లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 2022-2023 సంవత్సరానికి సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు 2 వేల కోట్ల రూపాయలను మరో పది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన తీవ్రం చేస్తామని రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు.
పంచాయితీలను అభివృద్ధి చేయలేని దుస్థితి :కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన గ్రామ పంచాయతీ సర్పంచులు, అన్ని రాజకీయ పార్టీల మద్ధతుతో గెలిచిన సర్పంచులు, ముఖ్య నాయకులు సమావేశానికి హాజరై తమ ఆవేదన వెలిబుచ్చారు. గ్రామాల్లో కనీసం వీధి లైట్లు, పారిశుద్ధ్యం, తాగునీరు, మురుగు కాల్వలను అభివృద్ధి చేయలేని దుస్థితిలో ఉన్నామని సర్పంచులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు తమ వద్దకు వస్తుంటే తప్పించుకుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సర్పంచు ఎన్నికల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచినా ఇప్పుడు రెండేళ్లవుతున్నా ఒరిగిందేమి లేదని వాలంటీర్లు, సచివాలయాల ద్వారానే పాలన సాగుతోందని మండిపడ్డారు.
అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిక : వైఎస్సార్సీపీ తరపున గెలిచిన సర్పంచులు కూడా తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోతే వచ్చే నెలలోనే వైఎస్సార్సీపీ జెండాలు పట్టుకుని అసెంబ్లీని ముట్టడిస్తామని ఆ పార్టీకే చెందిన ప్రకాశం జిల్లా సర్పంచు కొడాలి రమేష్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యవహారంపై వైఎస్సార్సీపీ సర్పంచులమని చెప్పుకోవడానికే సిగ్గేస్తుందన్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఎన్నికల్లో వైఎస్సార్సీపీకు గుణపాఠం నేర్పారని ఇక సర్పంచులు కూడా ప్రభుత్వానికి త్వరలో బుద్ధి చెబుతారని ఏపీ ఛాంబర్స్ ఉపాధ్యక్షుడు మునిరెడ్డి తెలిపారు.
ప్రభుత్వంపై సర్పంచుల పోరాటం :మార్చి నెలాఖరు వరకు వేచి చూసి ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రభుత్వంపై సర్పంచుల పోరాటం ఏ విధంగా ఉండాలనే దానిపై త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తామని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్స్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
ఇవీ చదవండి