ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివేకా హత్య కేసు నిందితులకు హైకోర్టులో ఎదురుదెబ్బ... ఆ పిటిషన్లు కొట్టివేత - వివేకా హత్య కేసు తాజా సమాచారం

high court
high court

By

Published : Feb 16, 2022, 11:21 AM IST

Updated : Feb 16, 2022, 12:40 PM IST

11:17 February 16

ys viveka murder case : ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు

ys viveka murder case : వివేకా హత్య కేసు నిందితులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దస్తగిరిని అప్రూవర్‌గా అనుమతించడాన్ని సవాల్ చేస్తూ గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఆ వ్యాజ్యాలపై కోర్టులో విచారణ జరిగింది. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.... పిటిషన్లను కొట్టివేసింది.

హైకోర్టులో వ్యాజ్యాలు..

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నాలుగో నిందితుడు, మృతుని మాజీ డ్రైవర్‌ దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు అనుమతిస్తూ కడప చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌/ప్రిన్సిపల్‌ అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి క్షమాభిక్ష ప్రసాదించడాన్ని సవాలు చేస్తూ మొదటి నిందితుడు ఎర్ర గంగిరెడ్డి, మరో నిందితుడు ఉమాశంకర్‌రెడ్డి హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. కడప కోర్టు ఈ ఏడాది నవంబరు 26న జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు.

దస్తగిరి అప్రూవర్‌గా మారతాడని, క్షమాభిక్ష పెట్టాలని, ఆయన సాక్ష్యాన్ని నమోదు చేయాలని సీబీఐ చేసిన అభ్యర్థనను కడప కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సహ నిందితులు గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. ‘పులివెందుల జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో సీబీఐ అక్టోబరు 26న గంగిరెడ్డి, వై.సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, షేక్‌ దస్తగిరిపై అభియోగపత్రం వేసింది. కడప చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో సీబీఐ సీఆర్‌పీసీ సెక్షన్‌ 306 కింద అక్టోబరు 22న పిటిషన్‌ దాఖలు చేస్తూ దస్తగిరి అప్రూవర్‌గా మారతారని, క్షమాభిక్ష ప్రసాదించాలని, సాక్ష్యాన్ని నమోదు చేయాలని కోరింది. నవంబరు 26న సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం అనుమతించింది. ఆ ఉత్తర్వులు చట్ట విరుద్ధం. కడప కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో పులివెందుల జ్యుడీషియల్‌ మొదటితరగతి న్యాయస్థానం.. దస్తగిరికి సమన్లు జారీ చేసి సీఆర్‌పీసీ సెక్షన్‌ 306(4)(ఏ) ప్రకారం సాక్ష్యాన్ని నమోదు చేసేందుకు యోచిస్తోంది. కడప కోర్టు ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయకపోతే మాకు నష్టం వాటిల్లుతుంది. రాజకీయ కుట్రలో భాగంగా అసలు నిందితులకు రక్షణగా దస్తగిరి కట్టుకథ అల్లిన విషయాన్ని కడప న్యాయస్థానం పరిగణనలోకి తీసుకొని ఉండాల్సింది. దస్తగిరికి అక్టోబర్‌ 22న ముందస్తు బెయిలు మంజూరు చేసేటప్పుడు సీబీఐ అభ్యంతరం లేదని చెప్పడాన్ని కడప కోర్టు దృష్టిలో పెట్టుకొని ఉండాల్సింది. నిందితుల నేర నిరూపణకు ఇంకేమీ సాక్ష్యాలు లేవనుకున్నప్పుడు మాత్రమే సీఆర్‌పీసీ సెక్షన్‌ 306 కింద దస్తగిరికి క్షమాభిక్ష పిటిషన్‌ సీబీఐ దాఖలు చేయాలి. ప్రస్తుత కేసులో సాక్ష్యాలు ఉన్నాయని చెబుతూనే 306 కింద పిటిషన్‌ దాఖలు చేయడం సరికాదు. క్షమాభిక్ష కోసం సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ వెనుక కంటికి కనిపించని కుట్ర దాగి ఉందనే విషయాన్ని కడప కోర్టు గమనించి ఉండాల్సింది. వివేక హత్యతో తమకు సంబంధం లేకపోయినా ఈ కేసులో ఇరికించేందుకు సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. దస్తగిరి వాంగ్మూలం లేనిదే నిందితుల నేర నిర్థారణ సాధ్యం కాదని కడప కోర్టు భావించింది. ఇతర సాక్ష్యాలున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని కడప కోర్టు దస్తగిరి అప్రూవర్‌గా మారి క్షమాభిక్ష ప్రసాదించేందుకు అనుమతిస్తూ నవంబరు 26న ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయండి. ఆ ఉత్తర్వుల ఆధారంగా తదుపరి చర్యలను నిలుపుదల చేయండి...’ అని వారు తమ తమ వ్యాజ్యాల్లో కోరారు.

ఇదీ చదవండి

CBI CHARGE SHEET: వైఎస్​ వివేకా హత్య కేసు.. అవినాష్​పై సీబీఐ అనుమానం

Last Updated : Feb 16, 2022, 12:40 PM IST

ABOUT THE AUTHOR

...view details