కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని మున్సిపల్ పాఠశాల ప్రాంగణంలో తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. మార్కెట్ ఏర్పాటు పేరుతో మొదట ఆటస్థలాన్ని తీసుకున్నారని, తర్వాత పాఠశాలను తీసుకునే అవకాశం లేకపోలేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. పాఠశాల ప్రాంగణంలో మార్కెట్ ఏర్పాటు సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. కూరగాయల మార్కెట్ ముఖ్యమే కాని.. అంతకంటే విద్యార్థులకు పాఠశాల ముఖ్యం అని పేర్కొంది.
న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ నిర్మాణాలు చేపట్టారని, ఈ విషయంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేస్తున్నామని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పగా.. విచారణను రెండు వారాలు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
ప్రొద్దుటూరులోని డాక్టర్ అనిబీసెంట్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆట స్థలంలో తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేస్తున్నారని.. ఆ ప్రక్రియను అడ్డుకోవాలని కోరుతూ ప్రొద్దుటూరుకు చెందిన కె.బాలచంద్రారెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరిలో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అప్పట్లో ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఇకమీదట నిర్మాణాలు చేపట్టవద్దని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.