ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

today crime news: వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి.. పలువురు అరెస్టు - కడప నేర వార్తలు

Crime News: రాష్ట్రంలో వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. తల్లిదండ్రులు మందలించారని ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. హోళగుంద మండల పరిధిలో జంట హత్యలకు కారణం వివాహేతర సంబంధమే అని పోలీసులు తేల్చారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వివిధ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ap crime news
ap crime news

By

Published : Feb 26, 2022, 1:49 PM IST

Updated : Feb 26, 2022, 10:52 PM IST

కడప నగరంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కడప అక్కయ్య పల్లెకు చెంది మహేశ్వర్​కు, సుజాతతో కొంత కాలం క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమార్తె ఉంది. అయితే.. మహేశ్వర్ జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసై కుటుంబం గురించి పట్టించుకునేవాడు కాదు. మందు మానేసి పద్ధతిగా ఉండాలని తల్లిదండ్రులు మహేశ్వర్ ను మందలించారు. దీంతో.. మనస్థాపానికి గురైన అతను విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదేవిధంగా.. కడప చిన్న చౌకు చెందిన 14 ఏళ్ల బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. బాలిక సరిగా చదవడం లేదని ఇంట్లో తల్లిదండ్రులు మందలించారు. మనస్థాపంతో పురుగులమంద తాగి బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..
ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం బూదవాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. పొగాకు కూలీలతో వెళుతున్న ఆటోను ట్రాక్టర్​ను ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఒంగోలు రిమ్స్​కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ట్యాంకర్..
కృష్ణా జిల్లా పెదపారుపూడి నాలుగు రోడ్ల కూడలి వద్ద జరిగిన జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారి అనే మహిళ మృతి చెందింది. ఆమె భర్త కృష్ణకు తీవ్రగాయాలయ్యాయి. నాలుగు రోడ్ల కూడలి వద్ద కాంక్రీట్ మిక్సర్ వాహనం దంపతుల వాహనాన్ని ఢీ కొట్టడం ఈ ప్రమాదం జరిగింది. వీరికి నలుగురు కుమార్తెలు కాగా ఇద్దరికీ వివాహం అయింది. పెదపారుపూడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

హత్యకేసులో ఎనిమిది మంది అరెస్ట్..
కృష్ణాజిల్లా తిరువూరు పట్టణంలో రెండు రోజుల క్రితం జరిగిన కళ్యాణపు కృష్ణచైతన్య హత్య కేసులో ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తిరువూరు పోలీసు స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. ఆర్టీసీ బస్టాండ్ క్యాంటీన్ నడుపుకునే కళ్యాణపు కృష్ణచైతన్యకు మునికుంట్ల శ్రీను అలియాస్ కారు బాబు మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగా వివాదం తలెత్తింది. వీరిద్దరి మధ్య పలు మార్లు గొడవలు జరిగాయి. ఇదే క్రమంలో బుధవారం అర్ధరాత్రి బస్టాండ్ నుంచి తన స్నేహితుడితో ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న కృష్ణచైతన్యపై కారు బాబు మరో ఏడుగురితో కలిసి దాడి చేసి దారుణంగా హత్య చేశారు. సీసీ పుటేజీ ఆధారంగా ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య వారే చేసినట్లు అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి మూడు కత్తులు, ఒక గొడ్డలి, రాళ్లు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

వాగులో పడి బాలిక మృతి..
గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణంలోని పాటిమీద ప్రాంతానికి చెందిన వెంకటరమణ అనే ఓ బాలిక బట్టలు ఉతికేందుకు ఓలేరువాగుకు వెళ్లింది. ప్ర‌మాద‌వ‌శాత్తూ వాగులో ప‌డింది. స్థానికులు రక్షించి వైద్యం కోసం జీజీహెచ్​కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. చిల‌క‌లూరిపేట అర్బ‌న్ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

దేవస్థానంలో అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి..
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని వైకుంఠపురం దేవస్థానంలో ఓ గుర్తుతెలియని వృద్ధుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై దేవస్థానం సిబ్బంది ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​కు సమాచారం అందించారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
శుక్రవారం మధ్యాహ్నం దేవస్థాన ప్రాంగణంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి సంచరిస్తుండగా.. గుడి మూసే సమయమని చెప్పి సిబ్బంది అతణ్ని బయటకు పంపారు. వారికి తెలియకుండా వ్యక్తి దేవస్థానంలోనికి ప్రవేశించాడు. సిబ్బంది చూసేలోగా తలనీలాలు సమర్పించే ప్రాంతంలో పడి ఉన్నాడు. పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

దొంగ అరెస్ట్.. బంగారు ఆభరణాలు స్వాధీనం
అనంతపురం జిల్లా హిందూపురం పరిసర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగను అరెస్ట్ చేసి 200 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు హిందూపురం వన్ టౌన్ పోలీసులు. పెనుకొండ డీఎస్పీ రమ్య వెల్లడించిన వివరాల మేరకు హిందూపురం పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో తాళం వేసిన ఇళ్లల్లో వరుసగా దొంగతనాలు జరుగుతుండడంతో పోలీసులు నిఘా పెట్టారు. హస్నాబాద్​కు చెందిన మహేష్ అనే దొంగను అరెస్టు చేసి విచారించగా పరిసర ప్రాంతాల్లో పదకొండు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్టు విచారణలో తేలిందన్నారు. అరెస్టు చేసిన ముద్దాయి వద్ద నుంచి 200 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్​కు తరలిస్తున్నట్లు తెలిపారు.

బీరు సీసాల లారీ బోల్తా..
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుశాలపురం కూడలి వద్ద కంటైనర్ బోల్తా పడింది. విశాఖ నుంచి బీర్‌ సీసాలతో శ్రీకాకుళం వెళ్తున్న కంటైనర్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ప్రమాదానికి గురైన వాహనం రోడ్డుకు అడ్డంగా బోల్తాపడింది.

వివాహేతర సంబంధం వల్లే జంట హత్యలు..
కర్నూలు జిల్లా హొళగుంద మండలం కోయిలతోటలో జరిగిన జంట హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమని వెల్లడించారు.

ఇదీ జరిగింది..
కర్నూలు జిల్లా హొళగుంద మండలంలోని కోయిలతోట గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి గాయత్రి అనే మహిళతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఆమె ఇటీవల అదే గ్రామానికి చెందిన హనుమంతప్ప అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయం భర్త శ్రీనివాస్​కు తెలిసింది. శ్రీనివాస్ ఈ విషయాన్ని బయటపెట్టకుండా సమయం కోసం వేచి చూశాడు. గురువారం రాత్రి భార్య గాయత్రి తన ప్రియుడుకి వీడియో కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది.

చనువుగా ఉన్న వీడియోలను చూసి..భర్త శ్రీనివాస్ తన భార్య సెల్​ఫోన్​లో వారిద్దరూ చనువుగా ఉన్న వీడియోలను చూశాడు. నాకు వేరే పని ఉంది... ఆలస్యంగా ఇంటికి వస్తానని భార్యకు చెప్పి బయటకు వెళ్లాడు. వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో ఇంటికి వెళ్లి.. ముందు తన భార్యతో ఉన్న వ్యక్తిని గొడ్డలితో నరికి చంపాడు. ఆ తర్వాత తన భార్య ప్రియుడుకి చేసిన వీడియో క్లిప్పింగ్స్ చూపించి ఆమెను హత్య చేశాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

పెద్దమంతూరులో గుర్తుతెలియని మహిళ శవం...

అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని పెద్దమంతూరు గ్రామ సమీపంలో గల పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని దుండగులు కాళ్లు కనిపించే విధంగా పూడ్చి వేశారు. ఈ ఘటనపై శనివారం సమాచారం అందుకున్న రొద్దం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. దుస్తులు గుంతలో వేసి వివస్త్రగా మృతదేహాన్ని ఇసుకలో పూడ్చి వేశారు. సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి రొద్దం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మహిళ ధర్నా

నెల్లూరు జిల్లా నాయుడుపేట పాత ఉపఖజానా కార్యాలయం ఎదుట రోడ్డుపై ఇటీవల పెళ్ళైన ఓ మహిళ ధర్నా చేసింది. వరకట్నం తెమ్మని భర్త వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె వాపోయింది. తమిళనాడు రాష్ట్రం గుమ్మడి పూడి కి చెందిన యువతిని నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం కానూరు కు చెందిన వ్యక్తి తో వివాహం చేశారు. పెళ్లైన కొన్ని నెలలు కాపురం సజావుగా సాగింది. తర్వాత అత్త భర్త వరకట్న వేధింపులు మొదలు పెట్టడంతో విడిపోయారు. ఈరోజు పెద్దల మధ్య చర్చలు విఫలం కావడంతో రోడ్డు తల్లి కూతురు కూర్చుని ధర్నా చేశారు.

కన్నతల్లినే హతమార్చిన కిరాతకుడు...
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్నతల్లినే కిరాతకంగా హతమార్చాడో కిరాతకుడు. మండలంలోని డేవిస్ పేటలో నివాసముంటున్న సుబ్బమ్మకు ఇద్దరు పిల్లలు. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు కన్నయ్య మాత్రం చెడు వ్యసనాలకు బానిసై అప్పులపాలయ్యాడు. అప్పు తీర్చేందుకు పొలం తాకట్టు పెట్టాలని తల్లిపై ఒత్తిడి చేశాడు. గతంలోనూ కొంత భూమిని తాకట్టు పెట్టిన కుమారుడు మళ్లీ పొలం తనఖా పెట్టాలని అడగడంతో అందుకు తల్లి అంగీకరించలేదు. దీంతో ఆస్తి కోసం తల్లితో.. కుమారుడు నిత్యం గొడవకు దిగుతుండేవాడు. ఈ నేపథ్యంలో పొలం తనఖా విషయమై ఘర్షణకు దిగిన కుమారుడు కన్నయ్య గడ్డపారతో తల్లి సుబ్బమ్మను పొడిచి దారుణంగా హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అంతర్ జిల్లా దొంగ అరెస్టు...
కడప నగరంలో పలు పోలీసు స్టేషన్ల పరిధిలో 10 ద్విచక్ర వాహనాలను దొంగలించిన అంతర్ జిల్లా దొంగను కడప రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి ఆరు లక్షల రూపాయల విలువ చేసే స్వాధీనపర్చుకున్నారు.

ఉద్యోగం పేరిట మోసం...పోలీసుల అదుపులో నిందితులు
గుంటూరు జిల్లా నరసరావుపేటలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని కొందరు ... ఓ వ్యకిని మోసం చేశారు. బాధితుడి వద్ద ఐఏఎస్ అధికారులుగా నటించి 11.5 లక్షలు వసూలు చేశారు. మోసం గ్రహించిన బాధితుడు డబ్బును తిరిగి ఇవ్వాలని అడిగాడు. అయితే మోసగాళ్లు...బాధితున్ని చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో అతను ఫిరంగిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 5.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

ఉపాధ్యాయుడిపై కేసు నమోదు...
చిత్తూరు జిల్లా వడమాల మండలం ఎస్​బీఆర్​పురం పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు మునయ్యపై కేసు నమోదైంది. విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నారంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:Illegal Affair: గదిలో అతడు, ఆమె... తాళం వేసిన భర్త.. తర్వాతే ఏమైందంటే..

Last Updated : Feb 26, 2022, 10:52 PM IST

ABOUT THE AUTHOR

...view details