ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బడుగులకు భరోసా...పేదలకు బాసట - కడప జిల్లా వార్తలు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: పేదలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా నవరత్నాల బడ్జెట్‌ పద్దు ఆవిష్కృతమైంది. సంక్షేమమే సగం బలంగా పొద్దు పొడిచింది. కర్షకుల కన్నీరు తుడవాలి.. నేతన్నలకు చేయూతనివ్వాలి.. వృత్తిదారులకు ఆర్థిక సాయం అందించాలి.. విద్యా రంగానికి పెద్దపీట వేయాలి.. పేదల ఆరోగ్యానికి ఆయుష్షు పోయాలనే సంకల్పంతో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ 2020-21 వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో కడప జిల్లాకు ప్రయోజనాలపై ప్రత్యేక కథనం.

cdp_budget
cdp_budget

By

Published : Jun 17, 2020, 9:05 AM IST

కరవు రైతుకు లబ్ధి..

జిల్లాలో సన్న, చిన్న, మధ్య, పెద్దకారు రైతులు 4.81 లక్షల మంది ఉన్నారు. వర్షాభావం, విపణిలో గిట్టుబాటు లభించక ఆర్థికంగా కుదేలైన అన్నదాతలను ఆదుకొనేందుకు వైఎస్సార్‌ రైతు భరోసా పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్రం పీఎం కిసాన్‌ పథకంలో ఇచ్చే రూ.ఆరు వేలు సాయానికి రాష్ట్రం రూ.7,500 అందిస్తుంది. ఏటా మూడు దశల్లో రూ.13,500 రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు. జిల్లాలో 2,91,370 మంది లబ్ధి పొందుతున్నారు. బుగ్గన పద్దులో ఈ ఏడాదికి రూ.3,615.60 కోట్లు కేటాయించారు. జిల్లాకు రూ.218 కోట్ల మేర రానుంది.

మట్టి మనిషికి భరోసా

మట్టి మనిషికి భరోసా

పుడమి పుత్రుల చెంతకే సాంకేతిక సలహాలు తీసుకెళ్లాలని, సాగులో సరికొత్త విధానాలను అమలు చేయించాలని కడప గడపలోని గ్రామీణ ప్రాంతాల్లో 620 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. ప్రభుత్వ భవనాలు 205 ఉంటే, ప్రైవేటు అద్దె గదులను 415 చోట్ల తీసుకొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.100 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో పలుచోట్ల సొంత భవనాలను నిర్మించనున్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల సేవలన్నీ ఒకే గూటికి చేరనున్నాయి.

వృత్తిదారులకు ఆపన్నహస్తం

వృత్తిదారులకు ఆపన్నహస్తం

చేతి వృత్తిదారులకు ఆపన్నహస్తం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈదఫా రూ.247 కోట్లు కేటాయించింది. ఇప్పటికే ప్రభుత్వ నిబంధనలను అనుసరించి రజకులు 7,372, దర్జీలు 5,706, నాయీ బ్రాహ్మణులు 1,975 మందిని జగనన్న చేదోడు పథకానికి ఎంపిక చేశారు. ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 వేలు చొప్పున రూ.15.05 కోట్లు ఇప్పటికే చెల్లించారు. వచ్చే నెల 10 తేదీ వరకు మిగతావారు దరఖాస్తు చేసుకునేలా గడువిచ్చారు. బడ్జెట్‌తో మరికొందరికి సాయం అందే అవకాశం ఉంది.

నేతన్నకు చేయూత..

నేతన్నకు చేయూత..

చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగించే కార్మికులకు సాయం చేయడానికి వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈసారి రూ.200 కోట్లు ఖర్చు చేస్తామని విత్త మంత్రి ప్రకటించారు. జిల్లాలో గతేడాది 11,774 మందికి అర్హత ఉందని తేల్చారు. ఒక్కో కార్మిక కుటుంబానికి రూ.24 వేలు అందించారు. సర్వే చేసి వీరిలో 2,782 మందిని అనర్హులుగా ఇటీవల తేల్చారు. కొత్తగా మరో 10,880 మంది దరఖాస్తు చేసుకొన్నారు. ఇంటింటి పరిశీనలలో వీరిలో కేవలం 319 మందిని ఎంపిక చేశారు. పాత, కొత్త కలిపి 9,311 మందికి నేతన్న నేస్తం అందనుంది. జిల్లాకు రూ.22.34 కోట్ల మేర లబ్ధి కలగనుంది.

పశుపోషకులకు వెన్నుదన్ను

పశుపోషకులకు వెన్నుదన్ను

వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుంది. ఎంతోమంది ప్రత్యామ్నాయంగా పశుపోషణ రంగం వైపు అడుగులేస్తున్నారు. జిల్లాలో తెల్ల పశువులు 1,37,099, గేదె జాతి 4,86,581, గొర్రెలు 18,69,861, మేకలు 5,78,609 ఉన్నాయి. ఏదైనా జబ్బు ప్రబలినా, ప్రమాదంలో మృతి చెందిన నాటు పశువులకు రూ.15 వేలు, సంకర, ముర్రా జాతి రకాలకు రూ.30 వేలు నష్టపరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో పాడి రైతుకు ఐదు పశువులకే సాయం అందుతోంది. గొర్రెలు, మేకలు మృతి చెందితే (ఒకే రోజు మూడు) 20 జీవాల వరకు సాయం అందిస్తారు. ఒక జీవానికి రూ.ఆరు వేలు చెల్లిస్తారు.

వాహన మిత్రతో ఊరట

వాహన మిత్రతో ఊరట

ఆటో, ట్యాక్సీ, ఇతర చిన్న వాహనాలను ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్న వారికి వాహన మిత్ర పథకంలో రూ.10 వేలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 13,947 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 2,529 మంది ఎంపికయ్యారు. మరికొన్ని రోజులు గడువు ఇవ్వడంతో మరికొందరు దరఖాస్తు చేసుకుంటున్నారు.

కాపు నేస్తం.. ఆర్థిక సాయం

కాపు నేస్తం.. ఆర్థిక సాయం

కాపు నేస్తం పథకంలో 8,111 మంది అంతర్జాలంలో దరఖాస్తు చేసుకున్నారు. అందులో ప్రభుత్వ నిబంధనలను అనుసరించి 7,376 మందికి అర్హత ఉంది. ఎంపికైన ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఐదేళ్లు ప్రభుత్వ సాయం అందనుంది. కాపుల సంక్షేమానికి రూ.2,846.7 కోట్లు కేటాయించారు. ఈనెలలో కాపు అతివలకు రూ.110.64 కోట్లు సాయం అందనుంది.

అధునాతన ప్రయోగశాల

అధునాతన ప్రయోగశాల

వ్యవసాయం చేసే రైతులు తరచూ కల్తీ, నాసిరకం విత్తనాలు, నాణ్యతలేని ఎరువులు, నకిలీ పురుగు మందుల వినియోగించి ఆర్థికంగా నష్టపోతున్నారు. జిల్లాలో సరైన విశ్లేషణ పరీక్షా కేంద్రాల్లేవు. జిల్లాలో నియోజకవర్గానికి ఒక సమీకృత అధునాత ప్రయోగశాలను నిర్మించాలని అనుమతించారు. బుగ్గన పద్దులో రూ.65 కోట్లు కేటాయించారు. జిల్లాలో ఒక్కో ల్యాబ్‌ నిర్మాణానికి రూ.55 లక్షల వరకూ ఖర్చు చేయనున్నారు. మన కోటా రూ.5 కోట్లకు పైగా నిధులు రానున్నాయి.

కొత్త వాహన యోగం

కొత్త వాహన యోగం

పేద ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు రెండు మండలాలకు కలిపి ఒక 108 వాహనం ఉంది. జిల్లాలో 26 ఉన్నాయి. కొన్ని ఎక్కువ కి.మీ.లు పరుగు తీసి అలసిపోయాయి. మరికొన్ని మరమ్మతులకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కొత్త వాహనాలను కొనుగోలు చేసి సేవలను విస్తరిస్తామని, మండలానికి ఒకటి కేటాయిస్తామని మంత్రి ప్రకటించారు. 104 వాహనాలు ప్రస్తుతం 22 ఉన్నాయి. ఈ ఏడాది మండలానికి ఒక వాహనం అందుబాటులోకి రానుంది. గ్రామీణులకు ఆపద సమయంలో వైద్య సేవలు అందే వెసులుబాటు లభించనుంది.

ఉచిత కానుక

ఉచిత కానుక

ప్రభుత్వ బడి గడపలోకి అడుగు పెట్టే పేద, మధ్యతరగతి వర్గాల భావి పౌరులకు విద్యా సామగ్రి ఉచితంగా ఇవ్వాలని జగనన్న విద్యా కానుకను అమలు చేస్తున్నారు. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 3,291 ఉన్నాయి. సర్కారు సరస్వతి నిలయంలో 2,09,154 మంది విద్యనభస్యసిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 3న బడి గంట మోగనుంది. తొలిరోజే ఒక్కో విద్యార్థికి జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, సంచి, పాఠ్య పుస్తకాలను అందించాలని కార్యాచరణను రూపొందించారు. ఈ పథకం అమలును మంత్రి బుగ్గన ప్రకటించారు.

ఇదీ చదవండి:సరిహద్దు ఘర్షణ చైనా వ్యూహంలో భాగమే!

ABOUT THE AUTHOR

...view details