కడపలో ఆంత్రాక్స్... గొర్రెల మృత్యువాత - 21 goats dies
ఆంత్రాక్స్ కడపను వణికిస్తోంది. అవగాహన కలిపించాల్సిన అధికారులు అడ్రస్ లేకపోవటం... గొర్రెల కాపరులకు శాపంగా మారింది. ఏమవుతుందో తెలుసుకునే లోపే నష్టం జరిగిపోతోంది. ఇటీవల కడప శివారులోని పొలాల్లో క్షణాల్లోనే గొర్రెలు, మేకలు చనిపోవటం కలవర పెడుతోంది.
ఆంత్రాక్స్ వ్యాధి ప్రబలుతోంది. ఉన్నట్టుండి జీవాలు కుప్పకూలి పోతున్నాయి. ఏడాదిపాటు పెంచుకున్న గొర్రెలు, మేకలు మృత్యువాత పడుతున్నాయి. గొర్రెల కాపరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కడప శివారులోని పొలాల్లో గొర్రెలు, మేకలను మేపు కుంటున్నారు. అందులో సుమారు ఇరవై ఒక్క గొర్రెలు ముక్కు, నోరు నుంచి రక్తం కక్కుకుని మూడు నిమిషాల వ్యవధిలోనే చనిపోయాయి. వారంరోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. కానీ అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ విషయం ఈటీవీ భారత్- ఈనాడు దృష్టికి రావడంతో స్థలానికి వెళ్లారు. అప్పటికే కొన్ని గొర్రెలు చనిపోయాయి. జిల్లాలో ఆంత్రాక్స్ నివారణ టీకా మందులు లేకపోవడంతో గొర్రెల కాపరులు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యాధి ఎలా వచ్చిందో తెలియలేదని గొర్రెల కాపరులు వాపోతున్నారు. ఆంత్రాక్స్ వ్యాధితో చనిపోయిన గొర్రెలను అవగాహన లేకపోవడంతో అలాగే వదిలేశారు. ఆ బ్యాక్టీరియా గాలిలో కలిసిపోయింది. ఇది చాలా ప్రమాదకరమని, అధికారులు వెంటనే ఆంత్రాక్స్ వ్యాధిపై టీకాలు వెయ్యాలని గొర్రెల కాపరులు కోరుతున్నారు.