YSR district: వైయస్సార్ జిల్లా పశుసంవర్ధక శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అచ్చన్న ఉన్నట్టుండి అదృశ్యం కావడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అచ్చన్న భార్య పిల్లలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కడప ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అచ్చన్న కాల్ డేటా ఆధారంగా అతని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లాకు చెందిన అచ్చన్న గత కొంతకాలం నుంచి కడప పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కానీ అదే కార్యాలయంలో అచ్చన్నకు అక్కడ పని చేస్తున్న సిబ్బంది మధ్య గత ఆరు మాసాల నుంచి మనస్పర్ధలు ఉన్నాయి.
సిబ్బందికి, అచ్చన్న మధ్య ఉన్న మనస్పర్ధలు రాష్ట్ర స్థాయిలో అందరి దృష్టికి పోవడంతో సంచలనంగా మారింది. నెల రోజుల క్రిందట సంబంధిత శాఖ డైరెక్టర్ వచ్చి కడపలో విచారణ కూడా చేపట్టారు. నివేదికను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12వ తేదీ ఆదివారం అచ్చన్న.. తను పని చేస్తున్న కార్యాలయానికి వెళ్లి తన సామగ్రిని కార్యాలయంలో ఉంచి చర్చికి వెళ్లాడు. అప్పటి నుంచి అతని చరవాణి స్విచ్ ఆఫ్ చేయబడింది. కర్నూలులో ఉంటున్న అచ్చన్న భార్య పిల్లలు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ స్విచ్ ఆఫ్‌లో ఉండడంతో వారు హుటాహుటిన కడపకు వచ్చారు.