నవాబు కాలం రూ.5 నోటు ఎలా ఉండేది? - notes
పురాతన కరెన్సీ నోట్లు, నాణేలను కడప జిల్లా జమ్మలమడుగులోని శాఖా గ్రంథాలయంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. పట్టణంలోని విద్యార్థులు ఇక్కడకు విచ్చేసి ఎంతో ఆసక్తిగా తిలకించారు.
కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని శాఖా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పురాతన కరెన్సీ నోట్లు, నాణేల ప్రదర్శనశాల చూపరులను ఆకట్టుకుంది. పిల్లలు, విద్యార్థులు విచ్చేసి పురాతనమైన నాణేలను ఆసక్తిగా తిలకించారు. కడప జిల్లా జమ్మలమడుగు, అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణాలకు చెందిన సదాశివ రెడ్డి, విష్ణుమూర్తి అనే వ్యక్తులు ఈ ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. ప్రాచీన చరిత్ర మరుగునపడిపోకుండా ఉండేందుకే ఈ ప్రదర్శనశాలను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. 1910, 1922 నాటి కరెన్సీ నోట్లు, సుమారు 85 దేశాలకు సంబంధించిన కరెన్సీ నోట్లు, 250 దేశాలకు సంబంధించిన పురాతన నాణేలను లైబ్రరీలో ప్రదర్శనగా ఉంచారు. ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం లేని దేశాలకు సంబంధించిన కరెన్సీ నోట్లను కూడా ఇక్కడ ప్రదర్శనగా ఉంచడం విశేషం. హైదరాబాదు నవాబు కాలం నాటి 5 రూపాయల నోటు కూడా మనం చూడవచ్చు. సింధు నాగరికత, కుషణులు, అక్బర్ నాటి నాణేలను ఇక్కడ ఏర్పాటు చేశారు.