కడప ఉక్కు ఎవరి భిక్షా కాదని.., విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీ అని అఖిలపక్ష నాయకులు అన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్న కేంద్రం.. ఎనిమిదేళ్లు గడుస్తున్నా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రాన్ని నిలదీసి పరిశ్రమ తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని నేతలు ప్రశ్నించారు. కడపలో ఉక్కు సాధన సమితి ఆధ్వర్యంలో 'కడప ఉక్కు రాయలసీమ హక్కు' అనే నినాదంతో అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాల నేతలు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సీఎం జగన్ ఇప్పటికైనా స్పందించి ఉక్కు కర్మాగారానికి పునాది రాళ్లు వేయకపోతే ప్రజలు సమాధి రాళ్లు వేస్తారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు.
కడప ఉక్కు ఎవరి భిక్షా కాదు.. వచ్చే ఏడాది నాటికి పరిశ్రమ పూర్తి చేయాలి: అఖిలపక్షం - కడప ఉక్కు పరిశ్రమపై అఖిలపక్షం
కడప ఉక్కు పరిశ్రమ కోసం పోరాటం చేయాలని అఖిలపక్షాలు నిర్ణయించాయి. విభజన చట్టం ప్రకారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్న కేంద్రం... ఎనిమిదేళ్లు గడుస్తున్నా నిర్లక్ష్యం చేస్తోందని నేతలు మండిపడ్డారు. కేంద్రాన్ని నిలదీసి పరిశ్రమ తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.
ఉక్కు పరిశ్రమ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత అన్ని పార్టీలకు ఉందన్నారు. తెదేపా, వైకాపా పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నాయని, మోదీకి వారు పూర్తిగా లొంగిపోయారని ఆరోపించారు. 'కడప ఉక్కు.. రాయలసీమ ప్రజల హక్కు' అనే నినాదంతో ముందుకు వెళ్లాలని.., ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. కనీసం 2023 డిసెంబరు కల్లా ఉక్కు పరిశ్రమ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెలాఖరుకల్లా కడప ఉక్కు కర్మాగారంపై అన్ని పార్టీలనూ కలుపుకొని దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తులసిరెడ్డి అన్నారు.
ఇదీ చదవండి: రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గాలు.. 15 మందికి గాయాలు!