కడప జిల్లాలోని మైదుకూరు, కాజీపేట మండలాల్లో ఆక్రమణలకు గురైన వందల ఎకరాల ప్రభుత్వ భూమిని సీపీఐ, బీఎస్పీ, సీపీఎం, సీపీఎమ్ఎల్, కాంగ్రెస్, లోక్సత్తా, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ... వందల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతున్నా రెవెన్యూ, అటవీ అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.
'కబ్జా చెర నుంచి ప్రభుత్వ భూమిని విడిపించండి' - మైదుకూరు తాజా వార్తలు
కడప జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గంలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మండిపడ్డారు. వెంటనే ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మైదుకూరు నియోజకవర్గంలో రాబందులు భూములు కబ్జా చేస్తుంటే... అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. 2,700 ఎకరాల భూమిని యథేచ్ఛగా కబ్జా చేస్తుంటే.. అధికారులకు సమాచారం అందలేదా అని ప్రశ్నించారు. ఇకనైనా అధికారులు స్పందించి కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే సర్వే నంబర్లు 506, 507, 511, 568, 658, 850లో ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. అలాగే ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నిజమైన పేదలకు పంపిణీ చేయాలని కోరారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ స్పందించకపోతే అన్ని పార్టీలు కలిసి ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఈశ్వరయ్య అన్నారు.