కడప జిల్లా కలెక్టరేట్ ఎదుట అఖిలపక్ష నాయకుల ధర్నా - కడప జిల్లాలో అఖిలపక్ష నాయకులు ధర్నా
కడప జిల్లా కలెక్టరేట్ వద్ద అఖిలపక్ష నాయకులు ధర్నా చేపట్టారు. జిల్లాలో వైకాపా, పోలీసులు దౌర్జన్యంగా విపక్షాల నామినేషన్లను ఉపసంహరించుకునే విధంగా చేశారని మండిపడ్డారు.
![కడప జిల్లా కలెక్టరేట్ ఎదుట అఖిలపక్ష నాయకుల ధర్నా all parties dharna at kadapa about local elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6454060-270-6454060-1584531342436.jpg)
కడప జిల్లా కలెక్టరేట్ ఎదుట తెదేపా, కాంగ్రెస్, సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేసి వెంటనే రీ షెడ్యూల్ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. దేశమంతా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంటే... ముఖ్యమంత్రి జగన్ మాత్రం మన రాష్ట్రంలో వైరస్ లేదన్నట్లు వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. కరోనా కారణంతో ఎన్నికల కమిషన్ ఆరు వారాల పాటు ఎన్నికలు వాయిదా వేస్తే.... ప్రభుత్వ పెద్దలు కమిషన్ నిర్ణయాన్ని తప్పు పట్టే విధంగా మాట్లాడటం సమంజసం కాదని మండిపడ్డారు. జిల్లాలో వైకాపా, పోలీసులు దౌర్జన్యంగా విపక్షాల నామినేషన్లను ఉపసంహరించుకునే విధంగా చేశారని ఆరోపించారు. ఎన్నికలను వాయిదా వేయాలని జిల్లా సంయుక్త పాలనాధికారి శివారెడ్డికి వినతి పత్రం అందజేశారు.