AITUC protest for VSP Steel Plant: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ఉక్కు పరిశ్రమను ప్రైవేట్‌పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేయడాన్ని మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ ప్రభుత్వం అనుసరించే విధానాలకు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వత్తాసు పలుకుతుందని ఏఐటీయూసీ నేతలు ఆరోపించారు.
32 మంది ప్రాణాలను పణంగా పెట్టి సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని ఏఐటీయూసీ నాయకులు హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మొండి వైఖరిని విడనాడాలని లేదంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోపాన్ని చవిచూడాల్సి వస్తుందని తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ కడప ఆర్డీవో కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోరు మెదపకపోవడం విడ్డూరంగా ఉందని ఖండించారు. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కున ప్రైవేటీకరణ చేయడం వలన ఎంతో మంది రోడ్డు పాలవుతారని పేర్కొన్నారు. మోడీ కేవలం తన వ్యక్తిగత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అఖిలపక్ష పార్టీ నాయకులందరిని తీసుకెళ్లి మోదీ వద్ద సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. తక్షణం ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని లేదంటే.. ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.