Chandrababu visit to Kadapa: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కడప పర్యటనలో భాగంగా.. పార్టీ నిర్వహించే జోన్-5 కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ఉమ్మడి కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలకు సంబంధించిన 35 అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ ఛార్జిలతో చంద్రబాబు వర్క్ షాపు నిర్వహిస్తారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయడంతో పాటు.. వారికి దిశా నిర్దేశం చేసేందుకు పార్టీ అధినేత కడపకు రానున్నారు. మంగళవారం కడప పర్యటన ముగించుకుని బుధవారం బద్వేలులో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
కడప బిల్టప్ సర్కిల్లోని పుత్తా ఎస్టేట్లో తెలుగుదేశం పార్టీ జోన్-5 సమావేశం మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్టీ వర్క్ షాపులో చంద్రబాబు పాల్గొంటారు. ఉమ్మడి కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలకు సంబంధించిన 35 అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ముఖ్యనేతలు, ఇన్ ఛార్జిలు, కస్టర్ ఇన్ ఛార్జిలు హాజరు కానున్నారు. దాదాపు 2500 మంది పార్టీ నాయకులు పాల్గొనే విధంగా జోన్-5 సమావేశం ఏర్పాటు చేశారు.
గడిచిన ఆరు నెలలుగా నిర్వహిస్తున్న బాదుడే-బాదుడు కార్యక్రమంపై ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తోంది.. భవిష్యత్తులో పార్టీ పరంగా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు చేరువ కావాలనే దానిపై చంద్రబాబు ప్రసంగంలో ఉటంకిస్తారు. ఏడాదిలోపే సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి పార్టీ శ్రేణులు కార్యోన్ముఖులు కావాలనే అంశంపై వారిని చైతన్య పరిచే విధంగా ప్రసంగించనున్నారు. వైసీపీ దొంగ ఓట్లను నమోదు చేయించే కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ అడ్డుకోవాలని పిలుపు ఇవ్వడంతో పాటు.. రాష్ట్రంలో కొనసాగిస్తున్న అరాచక పాలనను ఎండ గట్టాలని.. ప్రజలకు జరుగుతున్న నష్టాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యాచరణ ఉండే విధంగా పార్టీ శ్రేణులుకు దిశానిర్దేశం చేయనున్నారు.