పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం పెద్దకుడాల గ్రామానికి చెందిన ఎస్సీ మహిళ హత్య కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. హత్యకు గురైన మహిళ ఆరేళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది. గ్రామంలోనే మేకలను కాస్తూ జీవనం సాగిస్తోంది. రోజూలాగే మేకలను కాయడానికి సోమవారం కూడా అడవికి వెళ్లింది. కానీ ఆరోజు రాత్రి మేకలు ఇంటికి వచ్చినా..ఆమె రాలేదు. గ్రామస్తులు శివారు ప్రాంతాల్లో గాలించడంతో..శవమై కనిపించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు... ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎవరో బండరాయితో కొట్టి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ ఘటన జరిగి..3 రోజులైనా కేసును ఛేదించకపోవడంపై తెలుగుదేశం విమర్శలు గుప్పిస్తోంది. సీఎం నియోజకవర్గంలోనే మహిళలకు రక్షణ లేదని ట్విట్టర్ వేదికగా లోకేశ్ ఆరోపించారు.
ఒంటరిగా మేకలు కాయడానికి వెళ్లిన ఎస్సీ మహిళను ఎవరు హత్య చేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో జాగిలాలు, క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. గ్రామంలో పలువురిని విచారించారు. మహిళపై అత్యాచారం జరగలేదని.. పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు చెబుతున్నారు.సీఎం సొంత నియోజకవర్గంలోనే ఎస్సీ మహిళ దారుణ హత్యకు గురికావడం..... పోలీసులకు సవాల్‌గా మారింది.