కడప జిల్లా కొండాపురం మండలం గండికోట జలాశయం ముంపు బాధితుల సమస్యపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.
గండికోట జలాశయంలో ఈసారి 23 టీఎంసీల నీరు నిల్వ చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ఆదేశించటంతో... జిల్లా యంత్రాంగం ఆఘమేఘాల మీద ఆ దిశగా చర్యలు చేపట్టింది. గండికోట ముంపు కింద 7 గ్రామాల్లో ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం, పునరావాసం కింద 7 లక్షల రూపాయలను చెల్లించకుండా ఉన్న ఫలంగా ఇళ్లు ఖాళీ చేయాలని ఆదేశించారు. దీనిని నిరసిస్తూ 20 రోజుల నుంచి తాళ్ల ప్రొద్దుటూరు గ్రామస్థులు ఆందోళన చేపడుతున్నారు. ఆ గ్రామాన్ని గండికోట వెనకజలాలు చుట్టుముట్టాయి. కానీ అధికార యంత్రాంగం చలించటం లేదు. ప్రస్తుతం గండికోటలో 13 టీఎంసీలకు పైగానే నీరు నిల్వ చేశారు. ఇళ్లలోకి విష పురుగులు వస్తున్నాయని... కనీసం ఆరు నెలల గడువు ఇస్తే ఇళ్లు ఖాళీ చేస్తామని తాళ్లప్రొద్దుటూరు వాసులు చెబుతున్నా అధికారులు వినడం లేదు.