నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని... కారడవిలో వదిలేశాడు ఓ దయలేని పుత్రుడు. లాలించి, గోరు ముద్దలు తినిపించిన తనయుడికి.... ఆ తల్లి పోషణే కష్టంగా మారింది. దయాదాక్షిణ్యాలు మరిచి ఆమెను వదిలించుకోవాలని జన సంచారం లేని ప్రాంతంలో వదిలేశాడు. ఇది అర్థం కాని ఆ తల్లి పుత్రడు రాక పోతాడా అని నిరీక్షించింది. కాని ఆమె కోరిక తీరలేదు. ఆ తనయుడు రాలేదు. అది తెలుకున్న ఆ అమ్మ మనసు భోరున విలపించింది. కాసేపటికి నిస్సతువతో స్పృహ తప్పి పడిపోయింది.
కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన లింగమ్మని ఆమె కుమారుడు, కోడలు ఆటోలు తీసుకొచ్చి కడప సర్వజన ఆసుపత్రి సమీపంలో జనసంచారం లేని ప్రాంతంలో వదిలి వెళ్లాడు. తిరిగి వస్తామని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. వాళ్లు వస్తారని ఎంతో సేపు ఎదురు చూసిన ఆమె అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. అటు వైపు విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఆమెను చూసి వెంటనే సపర్యలు చేసి ఆమె వివరాలు తెలుసుకున్నాడు. ఆమె దయనీయ పరిస్థితి చూసి చలించిపోయిన కానిస్టేబుల్ వారు రారని నిర్ధారించుకుని ‘108’కి సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది వచ్చి ఆమెకు పూర్తిస్థాయిలో సపర్యలు చేసి కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.