ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాయమాటలతో రూ.35 లక్షలు దోచేశాడు..! - ఎన్​ఆర్​ఐను మోసం వార్తలు

ఎన్​ఆర్​ఐని మోసగించి లక్షల రూపాయల సొమ్ము కాజేసిన వ్యక్తిని కడప జిల్లా బద్వేలు గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 20 లక్షల రూపాయల విలువైన కారు, బంగారు నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు 'పీపుల్ అగైనెస్ట్ కరప్షన్' స్పచ్ఛంద సంస్థ నిర్వాహకుడిగా గుర్తించారు.

kadapa crime
kadapa crime

By

Published : Nov 13, 2020, 8:12 PM IST

కడప జిల్లా బద్వేలు గ్రామీణ పోలీసులు చీటింగ్ కేసులో 'పీపుల్ అగైనెస్ట్ కరప్షన్' అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేశారు. ప్రముఖులతో తనకు పరిచయాలు ఉన్నాయని ఓ ప్రవాసాంధ్రుడిని నిందితుడు నమ్మించి లక్షల రూపాయలు కాజేశాడు.

పోలీసుల కథనం ప్రకారం... కడప జిల్లా గోపవరం మండలం బెడూసుపల్లె గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి... 'పీపుల్ అగైనెస్ట్ కరప్షన్' పేరుతో స్వచ్ఛంద సంస్థ స్థాపించి సేవాతత్పరుడిగా తనకు తాను ప్రచారం చేసుకున్నాడు. పలువురు ప్రముఖులతో తనకు పరిచయాలున్నాయని ప్రచారం చేసుకున్నాడు. ఈ క్రమంలో ప్రవాసాంధ్రుడైన మైదుకూరు మండలం శెట్టివారిపల్లికి చెందిన రాజేష్ కుమార్​తో స్నేహం పెంచుకున్నాడు.

'రాష్ట్రంలో లైవ్లీ హుడ్ ప్రాజెక్టు వస్తుంది. దానిని దక్కించుకోవాలంటే 50 లక్షలు ఖర్చు అవుతుంది. అంత డబ్బు పెట్టేందుకు నాకు స్థోమత లేదు. మీరు 25 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే అంతా నేను చూసుకుంటాను. మనం పెట్టుబడి పెడితే ప్రాజెక్టు నిర్వహణ కింద మూడు కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇస్తుంది' అంటూ రాజేష్​ని నమ్మబలికాడు. రాష్ట్రంలోని ప్రముఖ నేతలు సైతం సహాయ సహకారాలు అందిస్తారని చెప్పాడు. గుడ్డిగా నమ్మిన రాజేష్ కుమార్ 25 లక్షల రూపాయలను శ్రీకాంత్ రెడ్డి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. మళ్లీ 10 లక్షల రూపాయలు కావాలంటే తన మామ వెంకటశివారెడ్డి ద్వారా శ్రీకాంత్ రెడ్డికి ఇప్పించారు.

ఈ డబ్బుతో నిందితుడు కారు, బంగారు నగలు కొనుగోలు చేశాడు. ఈ తతంగమంతా ఈ ఏడాది జులై నెల నుంచి జరుగుతూ వచ్చింది. ప్రాజెక్టు విషయమై మాట్లాడేందుకు శ్రీకాంత్ రెడ్డికి ఎప్పుడు ఫోన్ చేసిన స్విచ్ఛాఫ్​ వస్తుండటంతో... మోసపోయానని తెలుసుకున్న రాజేష్... తన బంధువు ద్వారా శ్రీకాంత్ రెడ్డిపై పోలీస్ స్టేషన్​ ఫిర్యాదు చేయించారు. ఈ మేరకు నిందితుడు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి 20 లక్షల రూపాయల విలువైన బంగారు నగలు, కారు, నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి

భూమి ఆక్రమణకు గురైందని తల పగలగొట్టుకున్న రైతు

ABOUT THE AUTHOR

...view details