కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలంలో జరిగిన హత్య కేసులో 20 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 13వ తేదీన కొండాపురం మండలం పెంజి అనంతపురం గ్రామంలో ఇరు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో కత్తులతో దాడి చేసుకుని పామూరు ప్రతాపరెడ్డి అనే విశ్రాంత సైనికోద్యోగిని హతమార్చారు. ఈ కేసుకు సంబంధించి బుధవారం కొండాపురం మండలం వెంకయ్య కాల్వ గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి గుడి వద్ద 20 మంది నిందితులతో పాటు 2 స్కార్పియో వాహనాలు, 3 ఇనుప పైపులు స్వాధీనం చేసుకున్నట్లు జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు తెలిపారు.
బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ... పి.అనంతపురం గ్రామంలో గండికోట ముంపు వాసులకు ఇచ్చే పరిహారంలో అవకతవకలు జరిగాయని.. విచారణ చేపట్టాలని హతుడు గురుప్రతాప్ రెడ్డి అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కలెక్టర్ హరికిరణ్ ఆదేశాల మేరకు ప్రత్యేక ఉప కలెక్టర్ రోహిణి ఆధ్వర్యంలో ఒక బృందం ఈనెల 13వ తేదీన ఆ గ్రామానికి వెళ్లి చెక్కుల విషయంపై ఆరా తీస్తుండగా.. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలిపారు.