బద్వేలు ఉపఎన్నిక బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత వచ్చింది(Badvel Bypoll 2021news). నామినేషన్ల ఉపసంహరణ తర్వాత పోటీలో 15 మంది అభ్యర్థులు నిలిచారు. ఇవాళ ముగ్గురు స్వతంత్రులు వారి నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మొత్తం 27 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. పరిశీలనలో 9 మందిని అధికారులు తిరిస్కరించారు.
2న ఓట్ల లెక్కింపు..
వైకాపా ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతితో ఖాళీ అయిన బద్వేలు స్థానానికి అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు అక్టోబర్ 1న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.
వైకాపా అభ్యర్థిగా డాక్టర్ సుధ
బద్వేలు ఎన్నికలో వైకాపా అభ్యర్థిగా వెంకటసుబ్బయ్య భార్య.. డాక్టర్ సుధ నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మంత్రులు కూడా ఉప ఎన్నికపై దృష్టిసారించారు. క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తూ.. పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ బైపోల్లో లక్ష మెజార్టీ సాధించటమే లక్ష్యంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
భాజపా అభ్యర్థిగా సురేష్...
బద్వేలు ఉప ఎన్నికలో (badvel by- election) భాజపా అభ్యర్థిగా పనతల సురేష్‌ను ఎంపిక చేశారు. పెనగలూరు మండలానికి చెందిన సురేష్.. 2019 ఎన్నికల్లో రైల్వేకోడూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఏబీవీపీ తరఫున, భాజపా తరఫున జిల్లాలో అనేక ఉద్యమాలు చేసిన సురేష్ ఉన్న పేరు ప్రతిష్ఠలు.. ఎన్నికల్లో కలిసి వస్తాయని భావిస్తున్నారు కమలనాథులు.
హస్తం నుంచి కమలమ్మ..
ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కమలమ్మ బరిలోకి దిగారు. వైకాపా అసమర్థత పాలనను, అన్యాయాన్ని ప్రశ్నించడానికే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని పార్టీ నాయకత్వం తెలిపింది.
తెదేపా, జనసేన దూరం..
బద్వేలు ఉపఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ప్రధాన ప్రతిపక్షం తెదేపా నిర్ణయించింది. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్‌బ్యూరో అత్యవసర సమావేశంలో..ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దివంగత ఎమ్మెల్యే సతీమణికే అధికార వైకాపా టికెట్ ఇవ్వటంతో..ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించినట్లు తెదేపా తెలిపింది. ఈ ఉపఎన్నికలో జనసేన పోటీ చేయడం లేదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా వెల్లడించారు. మరణించిన ఎమ్మెల్యే సతీమణికే టికెట్ ఇచ్చినందున మానవతా దృక్పథంతోనే బద్వేలులో పోటీ చేయడం లేదన్నారు. అయితే బద్వేలు ఉప ఎన్నికలో బరిలో నిలిచిన భాజపా అభ్యర్థికి తమ మద్దతు ఉంటుందని... ఆపార్టీ నేత నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి
new cj of ap high court: హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ ప్రమాణ స్వీకారం