ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసులనే బురిడీ కొట్టించాలనుకున్నారు... కటకటాలపాలయ్యారు - chakrampeta latest news

వారు ఎంచుకున్నదే అడ్డదారి. అందులోనూ దొంగ నాటకానికి తెరలేపారు. మధ‌్యలో మంచి ట్విస్టులతో స్క్రీన్‌ ప్లే కూడా రాసుకున్నారు. కానీ క్లైమాక్స్‌ అడ్డం తిరిగింది. పోలీసులు రంగంలోకి దిగి కటకటాల్లో శుభం కార్డు వేసేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాతో జల్సాలు చేసుకోవాలని భావించిన 10 మంది డిగ్రీ విద్యార్థులకు సంకెళ్లు వేశారు.

smuggling red sandalwood
smuggling red sandalwood

By

Published : Sep 16, 2020, 8:48 PM IST

పోలీసులనే బురిడీ కొట్టించాలనుకున్నారు... కటకటాలపాలయ్యారు!

కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమరవాణా చేస్తూ పెనగలూరు, పుల్లంపేట మండలాలకు చెందిన 13 మంది పోలీసులకు చిక్కారు. వీరిలో పదిమంది డిగ్రీ విద్యార్థులున్నారు. లాక్‌డౌన్‌ సమయం నుంచి చేతుల్లో డబ్బుల్లేక జల్సాలకు ఇబ్బంది పడుతున్న వీరి చూపు రైల్వేకోడూరు అటవీప్రాంతంలో ఎర్రచందనం చెట్లపై పడింది. కర్నాటకకు చెందిన ఓ స్మగ్లర్‌తో కలిసి నెల క్రితం బెంగళూరుకు రవాణా చేశారు. వచ్చిన డబ్బుతో జల్సా చేశారు. ఇక అలాగే లక్షలు సంపాదించాలని అనుకున్నారు. కూలీలు, రవాణాకు డబ్బు అవసరం పడడంతో పెనగలూరు మండలం చక్రంపేటలోని మద్యం దుకాణంలో పనిచేసే చినబాబు అనే వ్యక్తితో కలిసి ఓ నాటకానికి తెరలేపారు. విధులు ముగించుకుని ఇంటికెళ్తుండగా... తనపై కొందరు వ్యక్తులు దాడి చేసి 3 లక్షల 50 వేల రూపాయలు ఎత్తుకెళ్లారంటూ చినబాబు పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన పోలీసులు వారి నాటకాన్ని నిగ్గుతేల్చారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న 13 మందిలో చినబాబు కూడా భాగస్వామేనని గుర్తించారు. అంతేకాకుండా చినబాబు అనే వ్యక్తి ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తూ 2 లక్షల రూపాయల మద్యాన్ని విక్రయించి... ఆ డబ్బులను ఎక్సైజ్ అధికారులకు చెల్లించకుండా తప్పుడు లెక్కలు చూపినట్లు పోలీసు విచారణలో తేలింది.

ఆర్మీలో పనిచేసి కూడా...

13 మంది నిందితుల్లో వేమయ్య అనే వ్యక్తి ఆర్మీలో హవల్దార్‌గా పదవీ విరమణ పొంది రైల్వే కోడూరులో కిరాణా దుకాణం నడుపుతున్నాడు. సులభ సంపాదనపై ఆశతో ఎర్రచందనం అక్రమరవాణా చేస్తున్న యువతతో చేతులు కలిపాడు. మరోవ్యక్తిపై ఇప్పటికే ఎర్రచందనం కేసు నమోదు కాగా మళ్లీ 28 దుంగలను రవాణాకు సిద్ధం చేయగా పోలీసులు పట్టుకున్నారు.

రెండు కేసులు

మద్యం దుకాణంలో పనిచేస్తూ డబ్బు దోపిడీ నాటకంలో కీలకంగా వ్యవహరించిన చినబాబుపై పోలీసులు మరో కేసు నమోదు చేయనున్నారు. 2 లక్షల రూపాయల మద్యం అక్రమంగా విక్రయించడమే కాకుండా..దోపిడీ నాటకంతో 3 లక్షల 50 వేల రూపాయల ప్రభుత్వ సొమ్ము కాజేయడంపై కేసు పెట్టనున్నారు.

ఇదీ చదవండి

8 ఏళ్ల చిన్నారిపై వృద్ధుడు అత్యాచారయత్నం!

ABOUT THE AUTHOR

...view details