ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైయస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఎస్సీ బాలికపై గత కొంతకాలంగా ఓ యువకుడు, అతని స్నేహితులతో కలిసి మొత్తం 10 మంది అఘాయిత్యానికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సమాచారం తెలిసినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, కేసు నమోదు చేయలేదనే విమర్శలొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్పీ అన్బురాజన్ స్పందించారు.
బాలికపై అత్యాచారం ఘటనలో నిన్ననే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నాం. కేసును పోలీసులు ఆలస్యం చేశారనడంలో వాస్తవం లేదు. ఆరు నెలల కిందట బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. నాలుగు నెలల కిందట మరో ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలికను ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయిస్తున్నాం. ఘటనపై పూర్తి స్థాయి విచారణకు అదనపు ఎస్పీ పూజితను ఆదేశించాం. ఆమె ప్రస్తుతం ప్రొద్దుటూరు వెళ్లి విచారణ చేస్తున్నారు. -అన్బురాజన్, జిల్లా ఎస్పీ
నలుగురు నిందితులు అరెస్టు: ప్రొద్దుటూరులో బాలిక పై అత్యాచారం జరిగిన ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను రిమాండుకు తరలించారు. ప్రొద్దుటూరులో ఒకటో ఠాణాలో నిందితుల వివరాలు కడప ఏఎస్పీ పూజితా నీలం వెల్లడించారు. గర్భం దాల్చిన బాలిక వన్‌టౌన్ పీఎస్ పరిధిలో తిరగుతోందని వన్‌టౌన్ పోలీసులకు సమాచారం వచ్చిందన్నారు. బాలికను విచారించేందుకు మహిళా పోలీస్ స్టేషన్‌కు రావాలని పిలిచినా రాకుండా ఇంటికి వెళ్లిపోయిందన్నారు. తర్వాత 8 తేదీ అమృతనగర్‌లో తిరుగుండగా..మరో జీఎంఎస్‌కే రూరల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారన్న ఏఎస్పీ అక్కడ కూడా బాలిక తన వివరాలు చెప్పలేదన్నారు. బాలిక బంధువులు ఎవరూ లేకపోవడంతో ఎస్సై ఆమెను మైలవరం డాడీహోంకు తరలించారని పూజితా తెలిపారు. 9వత తేదీన బాలిక బంధువులు, తండ్రిని గుర్తించి వారిని ఫిర్యాదు చెయ్యాలని కోరగా..వారు స్పందించలేదన్నారు. దీంతో 11వ తేదీ ఐసీడీఎస్ సిబ్బందితో ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసి బాలిక పై అత్యాచారం చేసిన నలుగురిని అరెస్టు చేశారని ఏఎస్పీ వివరించారు.