కొవిడ్ రెండో దశ ప్రజలను నరకయాతనకు గురిచేసింది. వైరస్ ఉద్ధృతితో పల్లెలు కూడా తీవ్రంగా వణికిపోయాయి. వ్యాప్తిని నియంత్రించేందుకు ఊళ్లకు ఊళ్లే ఆంక్షల బాటపట్టాయి. అయినా పరిస్థితి కుదుటపడలేదు. పశ్చిమగోదావరి జిల్లాలోనూ రోజుకు దాదాపు 15 వందలకు పైగా కేసులు, సగటున 15 మరణాలు నమోదవుతున్నాయి. ఇలాంటి తరుణంలో జిల్లాలో కరోనా పాజిటివ్‌లు లేని గ్రామాలు ఉన్నాయంటే నమ్మశక్యం కాదు. కానీ ఆ ఆరు గ్రామాల్లో మాత్రం వైరస్ బాధితులే లేరు. ఏలూరు మండలం కోమటిలంక, నల్లజర్ల మండలం గుండేపల్లి, ద్వారకాతిరుమల మండలం మద్దులగూడెం, బుట్టాయిగూడెం మండలం ముంజులూరు, లింగపాలెం మండలం కొణిజర్ల, నరసాపురం మండలం రాజుగారితోట పంచాయతీల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గ్రామస్థులు తీసుకున్న రక్షణ చర్యలతో పాటు స్థానిక అధికారుల నిర్దేశమే ఇందుకు కారణం.
జిల్లా కేంద్రం ఏలూరు శివారు గ్రామమైన కోమటిలంకలో 200 కుటుంబాలు ఉండగా.. 15 వందల మంది జనాభా ఉన్నారు. గ్రామ సర్పంచి.. సచివాలయం సిబ్బంది, వాలంటీర్ల ద్వారా ఇంటింటికి తిరిగి కరోనాపై అవగాహన కల్పించారు. గ్రామంలో ఎవరూ మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఆదేశాలను గ్రామస్థులు పక్కాగా పాటించేలా నిర్దేశం చేశారు. పక్క గ్రామాల్లోని బంధువులను సైతం ఊళ్లోకి అనుమతించలేదు. మాస్కులు ధరించడంతో పాటు శానిటైజేషన్ వంటి రక్షణ చర్యలతో ఒక్క కేసూ నమోదుకాలేదని గ్రామస్థులు సంతోషంగా చెబుతున్నారు.