పశ్చిమ గోదావరి జిల్లా టీ నరసాపురం అల్లంచర్ల రాజుపాలెం గ్రామంలో ఉన్న సుమారు 126 ఎకరాల అటవీ భూమిపై.. స్థానికంగా ఓ నాయకుడి కన్ను పడింది. ప్రస్తుతం ఆ భూముల సరిహద్దుల్లో నివాసం ఉంటున్న పేదలను ఖాళీ చేయాల్సిందిగా సదరు నేత.. నిన్న రాత్రి ఓ ఇంటిపై దాడి చేశాడు. పదేళ్ల క్రితం ఇదే వ్యక్తి.. భూములు ఆక్రమించాడని.. ఇప్పుడు వైకాపా అధికారంలో ఉన్న అండ చూసుకుని మళ్లీ అటవీ భూముల ఆక్రమణకు పాల్పడుతున్నాడని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో తెదేపా ప్రభుత్వ ఉన్నప్పుడు ఆక్రమణలో ఉన్న అటవీ భూమిని స్వాధీనం చేసుకుందని గుర్తు చేశారు.
ఇటీవల ఓ వ్యక్తి రేకుల షెడ్ నిర్మించడంతో సదరు వ్యక్తి రాత్రి సమయంలో వెళ్లి ఆ ఇంటిని కూల్చివేశారని బాధితులు వాపోతున్నారు. అడ్డు వచ్చిన మరికొందరిని కొట్టి ఈ భూమి తనదేనని వెంటనే ఖాళీ చేయాలని చెప్పారని గ్రామస్తులు తెలిపారు. ఈ అంశంపై కొంతమంది నాయకులతో కలిసి టీ నరసాపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.