YSRCP leader protest: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం గ్రామంలో వైకాపా ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కాకిలేటి ఆనంద్ కుమార్ సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. చిట్టవరంలో నిర్మిస్తున్న డ్రైన్ విషయంలో జరిగిన గొడవలో దళిత మహిళలపై కొందరు దాడి చేసి కులం పేరుతో దూషించారని.. వారిపై నరసాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినట్లు తెలిపాడు. కేసు పెట్టి నాలుగు రోజులైనా దాడి చేసిన వారిపై ఎటువంటి కేసు నమోదు కాలేదని.. ఈ విషయమై అడిగిన తనపై పరుష పదజాలంతో రూరల్ ఎస్సై ప్రియకుమర్ దూషించినట్లు పేర్కొన్నాడు. ఎస్సైను సస్పెండ్ చేయాలని,.. దళితులపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ... ఆనంద్ కుమార్ సెల్ టవర్ ఎక్కాడు.
విషయం తెలుసుకున్న స్థానిక వైకాపా నాయకులు, సీఐ సంఘటన స్థలానికి చేరుకుని అనంద్కుమార్ను కిందకు దించేందుకు ఫోన్లో సంప్రదింపులు జరిపారు. సుమారు మూడు గంటలపాటు హైడ్రామా నడిచింది. పోలీసులు ఆనంద్ కుమార్‌తో తనకు తగిన న్యాయం చేస్తామని.. కిందికి దిగి రావాలని కొరారు. కేసు విషయమై పోలీసు స్టేషన్‌కు వెళ్ళిన తనను దురుసుగా ప్రవర్తించి.. మహిళల ముందు అవమానించి, బెదిరించిన ఎస్సైపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆనంద్ కుమార్ డిమాండ్ చేశాడు. దళితులకు న్యాయం చేయాలని కోరారు. సమస్యలు పరిష్కస్తానని సీఐ శ్రీనివాస్ యాదవ్ హామీ ఇవ్వడంతో ఆనంద్‌కుమార్ కిందకు దిగాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.