స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలను 4 వాయిదాల్లో చెల్లిస్తామని ఎన్నికల సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. 2019 ఏప్రిల్ 11 నాటికి సంఘాల అప్పు నిల్వలను చెల్లిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు బ్యాంకుల నివేదికల ఆధారంగా సంఘాల వారీగా అప్పు నిల్వలను ఆన్లైన్లో నమోదు చేశారు. తాజాగా సంఘాల వారీగా కాక వ్యక్తిగత ఖాతాల్లో రుణమాఫీ సొమ్మును జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో సంబంధిత సిబ్బంది మహిళలతో సమావేశమై వివరాలను నమోదు చేస్తున్నారు. ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, చరవాణి నెంబరు సేకరించి ఆన్లైన్లో పెడుతున్నారు. ఈనెల 20వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 86,800 స్వయం సహాయక సంఘాలు ఉండగా 72,464 సంఘాలు వైయస్సార్ ఆసరా పథకానికి అర్హత సాధించాయి. నిర్ణయించిన తేదీ నాటికి ఈ సంఘాలకు అప్పు నిల్వలు 2755.08 కోట్ల రూపాయలు ఉన్నట్లు అధికారులు నిర్ధరించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఈ మొత్తంలో నాలుగో వంతు 688. 77 కోట్ల రూపాయలను సెప్టెంబర్ 11వ తేదీన స్వయం సహాయక సంఘాల సభ్యుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయనున్నారు.
మొత్తం 63 వేల సంఘాలు అర్హత
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 74 వేల స్వయం సహాయక సంఘాలకు 63 వేల సంఘాలు రుణమాఫీకి అర్హత పొందాయి. వీరికి మొత్తం రూ. 2450 కోట్లు మాఫీ చేయాల్సి ఉండగా.. తొలివిడతగా రూ. 612.50 కోట్ల రూపాయలు అందించనున్నారు. పట్టణాల్లో రుణమాఫీకి అర్హత పొందిన 9,464 సంఘాలకు రూ. 76.27 కోట్లు మాఫీ చేయనున్నారు.