Young Astronaut Jahnavi: ఈ యువతి పేరు దంగేటి జాహ్నవి. ఊరు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఏడాది వయసున్నప్పుడే జాహ్నవి తల్లిదండ్రులు కువైట్‌కు వెళ్లిపోగా.. అప్పటి నుంచీ ఆమె ఆలనా పాలనా అంతా అమ్మమ్మే చూసింది. అలా అమ్మమ్మతో జాహ్నవికి అనుబంధం ఎక్కువ. చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన చందమామ కథల్లో అందరూ చందమామను చూస్తే.. జాహ్నవి మాత్రం జాబిలిపై అడుగుపెట్టడం ఎలా అని ప్రశ్నించుకుంది. ఇంటర్ వరకూ స్థానికంగా పాలకొల్లులోనే చదువుకున్న జాహ్నవి.. చదువులో సాధారణమే అయినా ఆటల్లో బాగా రాణించేంది. పాఠశాల స్థాయిలో నిర్వహించే విజ్ఞాన ప్రదర్శనలు అంటే జాహ్నవికి పిచ్చి. అలా ఎనిమిదో తరగతిలోనే తాను రూపొందించిన ఓ ప్రాజెక్టుకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు లభించింది.
ఏ రంగంలో రాణించాలన్నా దానిపై ఎంతో కొంత అవగాహన తప్పనిసరి. లేదా అందులో ప్రావీణ్యత సాధించిన వారి అడుగుజాడల్లోనైనా నడవాలి. కానీ రోదసిలో అడుగుపెట్టాలి, వ్యోమగామిగా రాణించాలన్న అభిలాష, ఆసక్తి ఉన్నా.. ఆ దిశగా నడిపించేవారు కానీ, మార్గనిర్దేశం చేసే వారు జాహ్నవికి లేరు. సరిగ్గా అదే సమయంలో.. చీరాలలో ఇస్రో వరల్డ్ స్పేస్ వీక్ పేరుతో నిర్వహించిన కార్యక్రమం జాహ్నవి కేరీర్‌ను మలుపు తిప్పిందని చెప్పాలి. అక్కడే ఆమెకు తాను ఎంచుకున్న వృత్తిలో రాణించేందుకు బలమైన అడుగులుపడ్డాయి.
కరోనా లాక్ డౌన్ అందరికీ అవరోధంగా మారితే.. జాహ్నవికి మాత్రం ఆ సమయం బాగా అక్కరకు వచ్చింది. గడప దాటి అడుగుబయట పెట్టలేని ఆరోజుల్లో.. ఇంటర్నెట్ ద్వారా అంతరిక్ష ప్రయోగాలు, వ్యోమగామి శిక్షణలు ఇచ్చే ప్రొఫెసర్లు, శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులతో తరచూ సంభాషించడం, వారి అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా తాను ఎంచుకున్న మార్గానికి సంబంధించి సమాచారాన్ని సేకరించింది. అలా నాసా ఆధ్వర్యంలో అందించే ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగామ్(ఐఏఎస్పీ)కు ఎంపికయ్యింది. మన దేశం నుంచి చిన్న వయసులోనే ఈ శిక్షణకు ఎంపికైన యువతిగా జాహ్నవి రికార్డు సృష్టించింది. అలా నాసా లూనార్ ఛాలెంజ్, నాసా స్పేస్ హ్యాకథాన్ లాంటి ఈవెంట్స్‌లో పాల్గొని మంచి అనుభవం సాధించింది. ఈ క్రమంలో ఓ రోవర్‌ని సైతం తన బృందంతో కలిసి నిర్మించింది. ఆస్టరాయిడ్ సెర్చ్ క్యాంపెయిన్ లోనూ పాల్గొన్న జాహ్నవి.. ఓ గ్రహశకలాన్ని సైతం కనుగొంది.