పశ్చిమగోదావరి జిల్లాలో ప్రవహిస్తున్న యనమదుర్రు కాలువ రైతుల పాలిట శాపంగా మారింది. ఖరీఫ్ పంట కాలంలో ఏటా నష్టాలను కలిగిస్తూ... రైతులకు బాధలు మిగుల్చుతోంది. జంగారెడ్డిగూడెం వద్ద నుంచి తాడేపల్లిగూడెం నందమూరు ఆక్విడెక్టు వరకు ఎర్ర కాలువగానూ, అక్కడినుంచి నర్సాపురం వద్ద సముద్రంలో కలిసే వరకు యనమదుర్రు కాలువగా దీన్ని పిలుస్తారు. ఖరీఫ్ పంట కాలంలో కురిసే వర్షాలకు ఎర్ర కాలువ ప్రవాహంతో పాటు పులివాగు, బైనేరు వాగు నీరు కూడా కలవడంతో.. యనమదుర్రు కాలువ పొంగిపొర్లి ప్రవహిస్తోంది. ఫలితంగా కాలువ పరిధిలోని పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి.
యనమదుర్రు కాలువ.. పంటను మింగుతోంది - rains in west godavari district
పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం వరిఘేడు, బల్లిపాడు గ్రామాల రైతుల పాలిట యనమదుర్రు కాలువ శాపంగా మారింది. ప్రతీఏటా వర్షాకాలంలో రైతులకు నష్టాన్ని మిగులుస్తోంది. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిమార్లు చెప్పినా కాలువ కట్టను సరిచేయడం లేదని రైతులు వాపోతున్నారు.
ముఖ్యంగా అత్తిలి మండలం వరిఘేడు, బల్లిపాడు గ్రామాల పరిధిలో వందలాది ఎకరాల వరి పంట నీటి ముంపునకు గురవుతోంది. తాజాగా వారం రోజుల్లో కురిసిన వర్షాలకు యనమదుర్రు పొంగి ప్రవహించడంతో.. పంటచేలు ముంపునకు గురై చెరువులను తలపిస్తున్నాయి. వారంరోజులుగా నీటిలో మునిగి ఉండటం వల్ల దుబ్బులు కుళ్లిపోయి పంటనష్టం తప్పదని రైతులు అంటున్నారు. ఇప్పటికే ఎకరానికి 12,500 రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని చెబుతున్నారు. యనమదుర్రు గట్టును బలపరిచి తమ పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండీ... ప్రలోభాలకు లోనై.. పార్టీకి ద్రోహం: చంద్రబాబు