భారీ వర్షాలకు పశ్చిమగోదావరి జిల్లాలో వాగులు, వంకలు పొర్లుతున్నాయి. బుట్టాయిగూడెం మండలం వీరన్నపాలెం, విప్పలపాడు మధ్య జల్లేరు వాగుపై ఉన్న కల్వర్టు, జంగారెడ్డిగూడెం మండలం పుట్టినపాలెంలో.. ఇదే వాగుపై ఉన్న మరో కల్వర్టు కొట్టుకుపోయాయి. సుమారు 60 గ్రామాల ప్రజలకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయా గ్రామాలకు చెందిన వారు ప్రమాదకరంగానే.. విధిలేని పరిస్థితుల్లో రాకపోకలు చేస్తున్నారు.
కల్వర్టులు ధ్వంసం... 60 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
ప్రభుత్వాలు మారినా గిరిపుత్రుల బతుకులు మాత్రం మారటం లేదు. భారీ వర్షాలకు రోడ్లు కొట్టుకుపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న పరిస్థితుల్లో.. గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రమాదకరంగానే గ్రామస్థులు వరదనీటిని దాటుకుంటూ ప్రయాణిస్తున్నారు.
కల్వర్టులు
కొన్నేళ్ల క్రితమే జల్లేరు వాగుపై పట్టినపాలెం వద్ద వంతెన నిర్మాణం చేపట్టినా అది నేటికీ పూర్తికాలేదు. ఫలితంగా... చిన్నపాటి వర్షానికే వాగు పొంగి రాకపోకలు నిలిచిపోతున్నాయి. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఆస్పత్రులకు వెళ్లే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి... వంతెన నిర్మాణం పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.