అతడు ఊహించి ఉండడు.. తన భార్య కట్టుకున్న చీరే... ఉరితాడులా మారి తనని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.. అతను అనుకొని ఉండడు.. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన అత్త కాటికి పంపిస్తుందని. క్షణికావేశంలో భర్తను.. తను కట్టుకున్న చీరనే మెడకు బిగించి హత్య చేసిందో భార్య. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం అర్జునుపాలెంలో జరిగింది.
భార్య, అత్త చేతిలో వ్యక్తి హతం... అనాథలైన ఇద్దరు ఆడపిల్లలు - అర్జునుడుపాలెం హత్య
భర్త తరచూ గొడవపడుతున్నాడని పుట్టింటికి వెళ్లిపోయిందామె... అమ్మ వాళ్ల ఇంటికి సైతం వచ్చి గొడవపడుతున్నాడని... అతడిని అంతం చేసేందుకు పూనుకుంది. కుమార్తెకు సర్ది చెప్పి, కాపురాన్ని సరిచేయాల్సిన తల్లి ఆమెకే సహకరించింది. ఫలితం ఇద్దరు ఆడపిల్లలకు తండ్రి లేకుండా చేశారు తల్లీకమార్తెలిద్దరు. అటు తండ్రిని కోల్పోయి.. ఇటు తల్లి,అమ్మమ్మ జైలుకు వెళ్తుంటే.. ఆ ఆడపిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
అర్జునుడుపాలెం గ్రామానికి చెందిన కొండయ్య, రామలక్ష్మికి 12 ఏళ్ల క్రితం వివాహమైంది. భార్యాభర్తలు తరచూ గొడవపడుతుండేవారు. ఈ క్రమంలోనే తన ఇద్దరు ఆడపిల్లలను తీసుకొని రామలక్ష్మి.. అదే గ్రామంలో ఉంటున్న పుట్టింటికి వెళ్లిపోయింది. అత్తింటికి వెళ్లిన కొండయ్య.. అక్కడ కూడా గొడవ పడ్డాడు. దీంతో విసిగిపోయిన రామలక్ష్మి.. తను కట్టుకున్న చీరనే కొండయ్య మెడకు బిగించి.. రామలక్ష్మి, ఆమె తల్లి కలిసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి.. ఇద్దరు నిందితురాళ్లను అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి మరొకరు బలి