పశ్చిమ గోదావరి జిల్లా టీ.నర్సాపురం మండలం మక్కినవారిగూడెం గ్రామంలో.. ఓ మహిళ తన భర్తను చంపిన తీరు.. అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కటారి అప్పారావు (35) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతను మొదట బంధువుల అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కొద్ది కాలానికే వారు విడిపోయారు. అనంతరం తెలంగాణలోని దమ్మపేటకు చెందిన లక్ష్మి ఉపాధి నిమిత్తం మక్కినవారిగూడెం రాగా.. ఆమెను ప్రేమించి పదిహేను ఏళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక కుమార్తె ఉంది.
ఇదిలా ఉంటే.. మద్యానికి బానిసైన భార్యాభర్తలు తరచూ ఒకరిపై ఒకరు అనుమానాలతో గొడవలు పడుతూ ఉండేవారు. ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకున్నారు. బుధవారం రాత్రి అప్పారావు మద్యం సేవించి ఆదమరిచి నిద్రిస్తుండగా.. అతడిని భార్య లక్ష్మి మంచాని కట్టేసింది. కొడవలితో అతని మర్మాంగాన్ని కోసేసింది. ఆ తరువాత గొంతుకు తాడు బిగించి అతి కిరాతకంగా హత్య చేసింది. అనంతరం ఇంటికి తాళం వేసి పారిపోయింది. గురువారం తెల్లవారుజామున భర్త సోదరుడికి ఫోన్ చేసి 'నేను వేరే ఊరు వెళ్తూ ఇంటికి తాళం వేసి వచ్చాను. మీ తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడు. వెళ్లి తలుపులు తీయండి' అని సమాచారం ఇచ్చింది.