పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికల హంగామా జోరందుకుంది. సీట్ల ఎంపికలో ప్రధాన పార్టీలు తలమునకలవుతున్నాయి. అధికార పార్టీ 10 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయగా, మరో ఐదు స్థానాల్లో కసరత్తు చేస్తోంది. నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం, పోలవరం, చింతలపూడి స్థానాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహులు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. సర్వేలు, అభిప్రాయసేకరణలతో లెక్కలు వేసుకుంటున్న అధినాయకత్వం.. గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది.
పశ్చిమలో సీట్ల కుస్తీ - asdf
ఆ జిల్లాలో స్థానాలన్నీ తెదేపా సొంతం. వైకాపాకు ఆ జిల్లాలో లేనేలేదు ప్రాతినిధ్యం. అలాంటి తీర్పునిచ్చిన జిల్లా కోస్తాలోని పశ్చిమగోదావరి. అధికార తెదేపాకు కంచుకోటగా ఉన్న పశ్చిమ గోదారి గట్టు.. ఎన్నికల సమరంతో వేడెక్కింది. ప్రధాన పార్టీలు తెదేపా, వైకాపాతో పాటు కొత్తగా వచ్చిన జనసేన.. గెలుపు గుర్రాలను అన్వేషించే పనిలో ఉంది.
ప్రతిపక్ష వైకాపా.. జిల్లా పరిధిలోని అసెంబ్లీ స్థానాల అభ్యర్థిత్వాల ఖరారుపై ఎటూ తేల్చటంలేదు. కొవ్వూరు, దెందులూరు, నరసాపురం, ఏలూరు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది.అధికార ప్రతిపక్షాలు.. వారం రోజులుగా అభ్యర్థుల ఖరారుకు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. సామాజిక సమీకరణాలు, బలబలాలకు పెద్దపీట వేస్తూ... ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తున్నాయి. అధికార పార్టీలో కొవ్వూరు, నిడదవోలు స్థానాలు.. ఉత్కంఠకు కేంద్రంగా మారాయి. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్న ప్రచారం నేపథ్యంలో.. ఎవరికి టికెట్ యోగం కలగనుందన్నదీ ఆసక్తిని పెంచుతున్నాయి. మిగిలిన నరసాపురం, భీమవరం, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం, ఉండి, ఉంగటూరు, దెందులూరు, ఏలూరు అసెంబ్లీ స్థానాల్లో సిట్టింగ్ లకే పట్టం కట్టింది పసుపు పార్టీ.
జిల్లా నుంచి మంత్రిగా వ్యవహారిస్తున్న కొవ్వూరు ఎమ్మెల్యే జవహర్‌కు టిక్కెట్ ఇవ్వొద్దని వ్యతిరేక వర్గం పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. నిడదవోలులో బూరుగుపల్లి శేషారావుకు సీటు రాకుండా అసమ్మతి నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న విషయం.. అధికార పార్టీ రాజకీయాన్ని వేడెక్కించింది. చింతలపూడి స్థానం నుంచి మాజీ మంత్రి పీతల సుజాతకు టిక్కెట్ ఖరారు చేస్తే తామంతా పనిచేస్తామని నియోజవర్గ తెదేపా నాయకులు అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ పనితీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నాలుగు స్థానాల్లో విజయావకాశాలు ఉన్న వ్యక్తులకే టిక్కెట్లు ఇచ్చేందుకు తెదేపా అధిష్టానం కసరత్తు చేస్తోంది.
ప్రతిపక్ష వైకాపా కూడా సీట్ల ఖరారు చేసే అంశంలో ఆచితూచి అడుగులేస్తోంది. దెందులూరు వైకాపా సమన్వయకర్తగా ఉన్న అబ్బాయి చౌదరికి టికెట్ కేటాయింపు అనుమానంగా మారింది. ఈ స్థానాన్ని మేకా శేషుబాబుకు కేటాయిస్తున్నట్లు వైకాపా వర్గాలు పేర్కొంటున్నాయి. కొవ్వూరు వైకాపా సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న తేనేటి వనిత స్థానంలో... మోసేరాజు దిగే అవకాశం ఉంది. పాలకొల్లు, ఏలూరు అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికీ స్పష్టతరాలేదు.
ఓటు పరీక్షను మొదటిసారిగా రాయబోతున్న జనసేన పార్టీ... జిల్లాలో సత్తా చాటేందుకు కాస్త నెమ్మదిగా వ్యూహాలు రచిస్తోంది. ఏలూరు, నరసాపురం, పాలకొల్లు, నిడదవోలు, భీమవరం మినహా మిగతా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను చేపట్టలేదు.