నాగరిక ప్రపంచానికి దూరంగా... అడవి తల్లికి దగ్గరగా ఉండే గిరిజన మహిళలు... ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. ఆన్లైన్ మార్కెట్లో కొత్త పుంతలు తొక్కతున్నారు. ఈ-కామర్స్ సైట్లతో ఒప్పందం చేసుకునే స్థాయికి నైపుణ్యాన్ని పెంచుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం కేఆర్ పురం ఐటీడీఏ పరిధిలో గిరిజన మహిళలు... ఆహార ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను నెలకొల్పారు. మూడేళ్ల క్రితం 20 మంది గిరిజన మహిళలకు ఐటీడీఏ శిక్షణ ఇప్పించి బిస్కెట్ల తయారీకి శ్రీకారం చుట్టింది.రాగులు, జొన్నలు, సజ్జలు, సోయా, పెసలు, అలసంద, మినుములు, ఓట్స్, బెల్లం వంటి పదార్థాలతో బిస్కెట్లు చేస్తున్నారు. మధుమేహం ఉన్నవారికి ప్రత్యేకమైనవి అందుబాటులోకి తెచ్చారు. తృణధాన్యాల మొలకలతో పౌష్టికాహార పౌడర్లు చేస్తున్నారు. ఈ ఉత్పత్తులను అమెజాన్‌లో విక్రయిస్తున్నారు. చిరుధాన్యాల బిస్కెట్లకు మంచి గిరాకీ ఉందని, వ్యాపారం బాగుందని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అమెజాన్‌లో.. అడవి ఆడబిడ్డల ఉత్పత్తులు - latest news on west godavari tribal women
ఒకప్పుడు అడవికే పరిమితమైన మన్యం ఆడబిడ్డలు.. నేడు అమెజాన్‌లో తమ ఉత్పత్తులు అమ్ముతున్నారు. తృణధాన్యాల బిస్కెట్లు, పౌష్టికాహార పౌడర్ల తయారీ చేపట్టి ఉపాధికి బాటలు వేసుకున్నారు. ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు తయారుచేస్తూ ఉపాధి మార్గాలు పెంచుకుంటున్నారు.
ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన మహిళలకు శిక్షణ ఇవ్వడమే కాక.. ఉత్పత్తులు విక్రయించడంలోనూ సహాయం అందిస్తున్నారు. భువనేశ్వర్, ఛత్తీస్‌గఢ్, విశాఖ, విజయవాడ ప్రాంతాల్లో మార్కెటింగ్ చేస్తున్నారు. 12 రకాల తృణ ధాన్యాలతో తయారు చేస్తున్న ఈ బిస్కెట్లు, మల్టీ గ్రెయిన్ పౌడర్లలో పోషకాలు ఉండటం వల్ల వినియోగదారులు విరివిగా కొంటున్నారు. వచ్చే లాభాలతో గిరిజన మహిళలు ఆర్థికంగా నిలుదొక్కుకొంటున్నారు.
ఆరోగ్యకరమైన తృణ ధాన్యాల ఉత్పత్తులను ప్రజలకు అందించడమే కాక.. తమ ఉపాధికి బాటలు వేసుకున్న ఈ మన్యం మహిళలు పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.