రహదారులు అభివృద్ధి సూచికలు... సురక్షిత ప్రయాణానికి సోపానాలు...వ్యాపార వృద్ధికి కారకాలు....ప్రగతికి మూలాధారాలు. అలాంటి రహదారులు పశ్చిమ గోదావరి జిల్లాలో అధ్వానంగా మారాయి ప్రయాణానికి ప్రతిబంధకాలవుతున్నాయి. ప్రమాదాలకు కారణమవుతున్నాయి. నిత్యం ఈ రహదారిపై ప్రమాదాలు జరిగి.. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నా.. వందల సంఖ్యలో క్షతగాత్రులుగా మిగిలిపోతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు.. రహదారులకు మరమ్మతులు చేయాలని ప్రజలు అభ్యర్థిస్తున్నా పట్టించుకునే వారే కరవయ్యారు.
అధ్వాన్నంగా రహదారులు.. పట్టించుకోరా? - పాడైన పశ్చిమ గోదావరి జిల్లా రహదారులు న్యూస్
వర్షం పడితే చాలు పశ్చిమ గోదావరి జిల్లా రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రహదారులపై ఏర్పడిన గోతుల్లో పడి వాహనదారులు మృతి చెందుతున్నా.. గాయాలపాలవుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. స్వయంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వెళ్లే రహదారి పరిస్థితి మరీ దారుణంగా తయారైనా.. అధికారులు పట్టించుకోకపోవటం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
జిల్లాలో ప్రస్తుతం 75 నుంచి 80 శాతం రహదారులు మరమ్మతులకు గురయ్యాయి. తాడేపల్లిగూడెం - భీమవరం, గోపాలపురం - జంగారెడ్డిగూడెం, గణపవరం - అడవికొలను, తాడేపల్లిగూడెం - కొయ్యలగూడెం, బాదంపూడి - తాడేపల్లిగూడెం, గణపవరం - దూబచర్ల తదితర రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. నిత్యం ఈ రహదారుల గుండా వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. జిల్లాలో ఇటీవల విస్తారంగా వర్షాలు కురవడంతో రహదారులపై ఉన్న గోతుల్లోకి వర్షపు నీరు చేరడంతో చెరువులను తలపిస్తున్నాయి. ఈ గోతుల్లో పడి తన వాహనాలు చెడిపోతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. ప్రాణాలు పోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉపముఖ్యమంత్రి ఇలాఖాలోనే దిక్కు లేదు..
పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి నుంచి తాడేపల్లిగూడెం వెళ్లే ఆర్ అండ్ బి రహదారి పెద్ద పెద్ద గోతులతో అధ్వాన్నంగా ఉంది. ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తాత గారు కాళీకృష్ణ స్థాపించిన ఆశ్రమం వద్ద రహదారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మంత్రి నాని తన కుటుంబ సభ్యులతో తరచూ ఈ ఆశ్రమానికి వస్తుంటారు. మంత్రి తలుచుకుంటే రహదారి రూపురేఖలు మార్చగలరని, కానీ మంత్రులు సైతం రహదారిని పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. బాదంపూడి గ్రామానికి చెందిన ఓ మాజీ ప్రజా ప్రతినిధి ప్రజల సమస్యపై స్పందించి గోతులను పూడ్పించారు. వర్షాలు కురవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.
'ఎన్నికల ముందు రహదారుల నిర్మాణాలు, విస్తరణ, అభివృద్ధి నిమిత్తం జిల్లాకు రూ.650 కోట్లు మంజూరయ్యాయి. అదే సమయంలో ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో నిధులు వెనక్కి వెళ్ళాయి. కొత్త ప్రభుత్వం వచ్చాక జిల్లాలో 12 పనుల నిమిత్తం సుమారు రూ.200 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటికీ ఆ పనులు మొదలు కాలేదు. ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.200 కోట్లకు సంబంధించిన పనులను త్వరలో ప్రారంభిస్తాం. అత్యవసరంగా చేపట్టాల్సిన రహదారులకు ప్రాధాన్యం ఇస్తాం.'
- నిర్మల, ఆర్ అండ్ బి ఎస్.ఈ
ఇదీ చదవండి:రాజుపోతేపల్లిలో పెట్రోలు బంక్ సీజ్