లాక్డౌన్ వల్ల చేనేత రంగం కుదేలయ్యింది. నేతపనిపైనే ఆధారపడిన వేలాది మంది చేనేత కార్మికులు రోడ్డునపడ్డారు. కనీసం ప్రభుత్వ పథకాలైనా ఆదుకుంటాయని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. పశ్చిమగోదావరి జిల్లాలో అర్హులైన చేనేతలకు ప్రభుత్వ పథకాలు చేరడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నేతన్నలకు ఆర్థిక సహాయం అందించేందుకు వైఎస్ఆర్ నేతన్న నేస్తం పేరిట పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద చేనేత కార్మికునికి ఏడాదికి రూ.24 వేలు అందజేస్తారు.
సొంత ఇళ్లలో మగ్గం నేసేవారికి మాత్రమే
సొంత ఇళ్లల్లో మగ్గం నేసే వారికి మాత్రమే పథకం వర్తింప చేస్తామని అధికారులు ప్రకటించారు. దీని ప్రకారం కేవలం 25 శాతం మందికి మాత్రమే ఫలితం దక్కింది. మాస్టర్ వీవర్ కింద పనిచేసే చేనేత కార్మికునికి ఈ పథకం వర్తింపచేయలేదు. జిల్లాలో వేలాది మంది కార్మికులు మాస్టర్ వీవర్ కింద పనిచేస్తున్నారు. మాస్టర్ వీవర్ యజమాని ఐదారు మగ్గాలు వేసి.. చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారు. అయితే ఇక్కడ రోజంతా మగ్గం నేసినా చేతికి కనీసం రూ.200 కూలీ కూడా రావడం లేదు. తమ ఇళ్లలో సొంత మగ్గంపై నేతపని చేసే కార్మికులు జిల్లాలో తక్కువగా ఉన్నారు. దశాబ్దాలుగా మగ్గంపై చేనేత పని చేస్తున్నా.. తమకు నేతన్న నేస్తం ఎందుకు వర్తించదని చేనేత కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
85 శాతం మందికి లేదు