పోలవరం వ్యవహారంలో ప్రధాని కార్యాలయం రాసిన లేఖకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వకపోవటంపై కేంద్ర జలశక్తి శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. 2 రోజుల్లోగా సమాధానం పంపాలని రాష్ట్రానికి గుర్తు(రిమైండర్) చేసింది. పోలవరం ప్రాజెక్టు విషయమై రాష్ట్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను, 2018 జనవరిలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మధ్య తేడాకు కారణాలను తెలపాలంటూ పీఎంవో గత నెల 20 వ తేదీన లేఖ రాసింది. దానిపై ఈ నెల 3వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. గడువు దాటిపోయి వారం కావటంతో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జలశక్తి శాఖ రిమైండర్ పంపింది. అభిప్రాయాన్ని పంపాలని గతంలో చెప్పిన పట్టించుకోకపోవటంపై అందులో తప్పుబట్టింది.
అధికారులకు ఫోన్
ప్రాజెక్టులో ఇప్పటివరకు జరిగిన పనులపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ నివేదికను తెప్పించుకుంది. అయితే అందులోని అంశాలు 2018 జనవరిలో జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు భిన్నంగా ఉండటంపై పీఎంవో ఆరాతీసింది. ఆ రోజు జరిగిన సమావేశంలో పోలవరం పాత కాంట్రాక్టురు నుంచి మెుబిలైజేషన్ అడ్వాన్సుల వసూలను వాయిదా వేయడానికి గల కారణాలను అధికారులు వివరించారు. ఇంకా ప్రత్యేక నిధి ఏర్పాటు ప్రాజెక్టులోని కొంత భాగానికి టెండర్ల జారీతో పాటు అనేక ఇతర అంశాలపై అధికారులు స్పష్టత ఇచ్చారు.ప్రధాన కాంట్రాక్టురు నుంచి కొన్ని పనులను తొలగించి కొత్త ఏజెన్సీకి వాటిని అప్పగించటానికి దారీతీసిన కారణాలను రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి అప్పట్లో సమర్థించుకున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక అందుకు పూర్తి విరుద్దంగా ఎందుకుందో చెప్పాలని పీఎంవో కోరింది. దీనిని గుర్తుచేస్తూ కేంద్రజలశక్తి మంత్రిత్వశాఖ ప్రస్తుత నిపుణుల కమిటీ చేసిన సిఫార్సుల్లోని ప్రతి ఒక్క అంశంతో ముడిపడి ఉన్న నిబంధనలను గురించి వివరిస్తూ వెంటనే సమాధానం ఇవ్వాలని సూచించింది. ఇదే విషయమై రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌తో కేంద్ర జలవనరులశాఖాధికారులు ఫోన్లో మాట్లాడి వెంటెనే స్పందించాలని కోరినట్లు తెలిసింది.