పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం వెలగపల్లి గ్రామంలో వెంకట సాయి కృష్ణ ట్రేడర్స్ రైస్ మిల్లులో వాచ్ మన్‌గా పని చేస్తున్న సాల్మన్ రాజు(52)ను అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బలమైన కర్రతో మోది హతమార్చారు. ఉండి మండలం ఆరేడు గ్రామానికి చెందిన సాల్మన్ రాజు రోజువారి విధులు నిర్వహించేందుకు వెలగపల్లిలోని రైస్ మిల్లుకి వచ్చాడు.
విధి నిర్వహణలో ఉన్నప్పుడు అర్ధరాత్రి అతనిపై దాడి జరిగినట్లు అక్కడికి వచ్చిన ఓ లారీ డ్రైవర్.. గణపవరం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కొన ఊపిరితో రక్తస్రావంలో పడి ఉన్న రాజును గణపవరం ప్రాథమిక ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు సీఐ డేగల భగవాన్ ప్రసాద్ తెలిపారు.