వాలంటీర్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ ప్రతి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులతో పాటు వారి అవసరాలను, సంక్షేమ కార్యక్రమాలు పొందుతున్న తీరును తెలుసుకోవటం కోసం సమగ్ర సర్వేకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే వాలంటీర్లు సర్వే కార్యక్రమం చేపట్టగా, పట్టణ ప్రాంతాల్లో ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు, గ్రామాల్లో సంబంధిత మండల పరిషత్ అధికారులు వాలంటీర్లకు గుర్తింపు కార్డులివ్వాలని ప్రభుత్వం సూచించింది.. కానీ వాటికి సంబంధించి ఎటువంటి నిధులు మంజూరు చేయలేదు. తాజాగా గ్రామాల్లో సర్వే కోసం ఒక్కొక్క ఇంటి నుంచి వివరాలు సేకరించడానికి 15 పేజీల నమూనాను విడుదల చేసింది. ఈ నమూనాలు జిరాక్స్ కాపీ తీసి వాలంటీర్లకు అందజేయాలని ఎంపీడీవోలను ఆదేశించింది. ఒక మండల పరిధిలో ఆయా గ్రామాల్లో వేల సంఖ్యలో గృహాలు ఉండడంతో కేవలం జిరాక్స్ కాపీలకే లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి రావడంతో ఎంపీడీవోలు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా పంచాయతీ అధికారులను సంప్రదిస్తే తమకు సంబంధం లేదని తప్పించుకుంటున్నారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారులను సంప్రదిస్తే ముందు సర్వే జరిగేలా చూడండి ఖర్చుల గురించి మేము ఆలోచిస్తాం అంటూ తేల్చేస్తున్నారు. దీంతో పురపాలక సంఘాల పరిధిలోని సాధారణ నిధులు ఖర్చుచేయమని కమిషనర్లు భరోసా ఇవ్వటంతో ముందుకు సాగుతున్నారు. కానీ ఈ నిధులు మాత్రం ఎంత వరకు సరిపోతాయో తెలియకపోవటంతో ప్రభుత్వం వెంటనే స్పందించాలని అధికారులు కోరుకుంటున్నారు. మరోవైపు సమగ్ర సర్వేలో నిమగ్నమైన వాలంటీర్లు ప్రభుత్వ సూచనల ప్రకారం వివరాలు సేకరించడానికి నానా తంటాలు పడుతున్నారు.
నిధులివ్వకుండా సర్వే ఎలా నిర్వహించాలి సార్..? - గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు నిధులు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ నిర్వహణలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. సంక్షేమ కార్యక్రమాల కోసం గ్రామ వాలంటీర్లచే సర్వే నిర్వహించమన్న ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవటంతో అధికారుల నానా తంటాలు పడుతున్నారు.
సర్వే కోసం గ్రామ వాలంటీర్ల తంటాలు